
- అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు: సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం (జూన్ 21న) జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.
తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని గుర్తుచేసుకున్నారు. అందుకే ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని సీఎం అభిప్రాయపడ్డారు. తన అనుభవాన్ని మొత్తం తెలంగాణకు ధారపోసి, రాష్ట్ర ఏర్పాటుకు ముందే అన్ని రంగాల్లో మన రాష్ట్రానికి ఉన్న ఉజ్వల భవిష్యత్తును వీక్షించిన స్వాప్నికుడు జయశంకర్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ విలేజ్ గా ప్రకటించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేసుకున్నారు.
ఆషాఢ మాస బోనాలకు సీఎంకు ఆహ్వానం
ఆషాఢ మాస బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు ఆహ్వానించారు. గురువారం సీఎం నివాసంలో ఆయనకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.