బిహార్ తప్ప అంతటా BJPతో JDU కటీఫ్

బిహార్ తప్ప అంతటా BJPతో JDU కటీఫ్

బీజేపీ, జేడీయూ మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. బీహార్ వరకే బీజేపీతో పొత్తు ఉందని ప్రకటించింది జేడీయూ జాతీయ కార్యవర్గం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్  లో  బీజేపీతో పొత్తు ఉండదని  తేల్చిచెప్పింది.

పట్నాలోని సీఎం నితీష్ కుమార్ ఇంట్లో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  టీఎంసీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉంటారన్న వార్తలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బెంగాల్ లో మమతా బెనర్జీతో కిషోర్ భేటీ కావడంపై నితీష్ కుమార్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర కేబినెట్ లో ఒకటే బెర్త్ ఇస్తామన్న బీజేపీ నిర్ణయంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. బీజేపీపై అసంతృప్తితో మోడీ కేబినెట్ లో చేరలేదు జేడీయూ. బీజేపీకి కౌంటరిస్తూ బీహార్ లో మంత్రివర్గాన్నివిస్తరించారు సీఎం నితీశ్ కుమార్. 8 మంది జేడీయూ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇఫ్తార్ విందుల్లోనూ ఎవరికి వారుగానే వ్యవహరించారు బీజేపీ, జేడీయూ నేతలు. వివాదం కొనసాగుతుండగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేస్తామని జేడీయూ నిర్ణయించడంతో రెండు పార్టీల మధ్య పొత్తుకు బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతోంది.