జెట్ ఎయిర్‌‌‌‌వేస్ కు మరో చాన్స్

జెట్ ఎయిర్‌‌‌‌వేస్ కు మరో చాన్స్
  • పైలెట్ల అర్థరాత్రి సమ్మె ఆఖరి క్షణంలో వాయిదా
  • మేనేజ్ మెంట్​కు ఇదే ఆఖరి చాన్సన్న యూనియన్
  • నిరుద్యోగులుగా మారుతున్న 20వేల మంది
  • తక్కువ జీతాలకే ఉద్యోగుల వలస

జెట్ రెక్కలు తెగినట్టేనా..? అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే లీజులు సరిగ్గా చెల్లించకపోవడంతో చాలా విమానాలు గ్రౌండ్‌ కే పరిమితమయ్యాయి. అద్దెదారులు కూడా జెట్‌ నుంచి తమ విమానాలు తీసుకుని పోతున్నారు. తాజాగా పైలెట్లు ఎదురుతిరిగారు. మూడున్నర నెలలుగా జీతాల లేక అలమటించిన జెట్ పైలెట్లు, అర్థరాత్రి నుంచి విమాన సర్వీసులను ఆపేస్తున్నట్లు మొదట ప్రకటించారు. అయితే ఆఖరి క్షణంలో సమ్మెను విరమించి మేనేజ్ మెంట్​కు మరో చాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. సోమవారం నాడు జెట్​ మేనేజ్ మెంట్​ స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో పైలెట్లు సమ్మెకు దిగే అవకాశముంది.

వేతన బకాయిలు సరిగ్గా చెల్లించకపోవడంతో అర్థరాత్రి నుంచి విమానాలు ఎగరడాన్ని ఆపివేయాలని పైలెట్లు, ఇంజనీర్లు నిర్ణయించినట్టు నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(జెట్ ఎయిర్‌‌‌‌వేస్ పైలెట్ల యూనియన్) సీనియర్ అధికారులు ఆదివారం ఉదయం ప్రకటించారు. అర్థరాత్రి నుంచి విమానాలను ఆపేస్తామన్న పైలెట్లు..ఆఖరి క్షణంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. సోమవారం ఉదయం తిరిగి సమావేశం కాబోతున్నట్టు తెలిపారు.జెట్ మేనేజ్ మెంట్ కు ఇదే ఆఖరి చాన్స్ అని చెప్పారు. అంతకుముందు‘నిరుద్యోగం అనేది ఎన్నికల సమస్య. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌లో పనిచేసే 20వేల మందికి పైగా ఉద్యోగులు నిరుద్యోగులవనున్నారు’ అని పైలెట్ల యూనియన్​ లీడర్ చోప్రా చెప్పారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌‌‌‌వేస్ అద్దె దారులకు లీజులు సరిగ్గా చెల్లించకపోవడంతో చాలా విమానాలు గ్రౌండ్‌ కే పరిమితమవుతున్నాయి. అంతేకాక చాలాఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌లను సొంతదారులు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలకు జెట్ విమానాలు నడవడం లేదు. గత వారమే అంతర్జాతీయ మార్గాలకు జెట్ విమానాలను ఆపివేసింది. ఇక ఇప్పుడు పూర్తిగా విమాన రాకపోకలు ఆగిపోయాయి. పైలెట్లందరూ ఫుల్ యూనిఫాం లో సిరోయా సెంటర్‌‌‌‌లో హాజరుకావాలని పైలెట్ల బాడీ ఆదేశించింది. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ ఉద్యోగులు శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ఆందోళన కూడా చేశారు. ముంబైలోనూ ఆందోళన జరిగింది.

25-30 శాతం తగ్గింపు జీతాలకు జాయిన్…

ఇక జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ ఆర్థిక సంక్షోభాన్ని దాని ప్రత్యర్థులు స్పైస్‌‌జెట్, ఇండిగోలు అందిపుచ్చుకుంటున్నాయి. జెట్ ఎయిర్‌‌‌‌వేస్ ఇంజనీర్లను, పైలెట్లను తక్కువ జీతాలకు స్పైస్‌‌ జెట్ నియమించుకుం టోంది. రిపోర్టుల ప్రకారం, జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ పైలెట్లు తమ వేతనాల్లో 25 శాతం నుంచి 30 శాతం తగ్గించుకుంటున్నారు. ఇంజనీర్లు కూడా తమ జీతాల్లో 50 శాతం తక్కువకు స్పైస్‌‌జెట్‌‌లో జాయిన్‌ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ సగటు జీతాలు, ఇండస్ట్రీ స్థాయికంటే ఎక్కువగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ సొంత పే విధానాలకు అనుగుణంగా వేతనాలను ఆఫర్ చేస్తున్నామని, జెట్ చెల్లించే వేతనాల విధంగా కాదని స్పైస్‌‌జెట్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. వేతన చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో, 4–5 ఏళ్ల అనుభవమున్న పైలెట్లు ఇతర ఎయిర్‌‌‌‌లైన్ సంస్థలకు వెళ్తున్నారు.రుణాలు, ఇతర ఫైనాన్సియల్ కమిట్‌‌మెంట్లతో వీరు స్థిరమైన, సరైన సమయానికి వేతనాలు ఇచ్చే ఉద్యోగాల కోసం చూస్తున్నారని చెప్పారు.

ఎయిరిండియాలో రిక్రూట్‌ మెంట్ …

అయితే సీనియర్ స్థాయి పైలెట్లు మాత్రం ఎక్కువమంది జెట్‌‌ను వీడటం లేదని పేర్కొన్నారు. వారు జెట్‌‌ను వీడితే సీనియారిటీ, వేతనాలు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారని అధికారి చెప్పారు. అటు స్పైస్‌‌జెట్ మాత్రమే కాక, ఎయిరిండియా కూడా జెట్‌‌ సిబ్బందిని నియమించుకుంటోంది. కొన్ని రోజుల క్రితమే,క్రూ మెంబర్ల కోసం రిక్రూట్‌‌మెంట్‌‌ను ప్రకటించింది. ‘ఎయిరిండి యా 1200 మంది క్రూ మెంబర్లను నియమించుకోవాలనుకుంటోంది.తొలి దశలో భాగంగా వీరికి రాత పరీక్ష నిర్వహించింది. 514 క్రూ మెంబర్లను షార్ట్‌‌ లిస్ట్ చేసింది. ప్రస్తుతం రిక్రూట్‌‌మెంట్ ప్రాసెస్‌‌ నడుస్తోంది’ అని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. సుమారు 150 మంది క్రూ మెంబర్లు జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ నుంచి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మంది షార్ట్‌‌లిస్ట్ అయ్యారు. జెట్‌‌ నుంచే కాకుండా.. ఎయిరిండియాలో ఉద్యోగాల కోసం దాఖలు చేసుకున్నవారిలో విస్తారా క్రూ మెంబర్లు కూడా ఉన్నారు.ఎయిరిండియాలో ప్రస్తుతం నాలుగు వేల మంది క్రూ మెంబర్లే ఉన్నారు. అందుకే భారీగా నియామకాలను చేపట్టింది. ఇండిగో కూడా జెట్ఎయిర్‌‌‌‌వేస్ పైలెట్లను, ఇంజనీర్లను తన సంస్థలో నియమిం చుకుంటోంది. దేశంలో తీవ్ర పైలెట్ల సమస్య ఉంది. జెట్ పైలెట్లు ఇతర ఎయిర్‌‌‌‌లైన్స్‌‌కు వెళ్తుండటంతో, దాని భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. అద్దె దారులు విమానాలు తీసుకుపోవడం, పైలెట్లు ఇతర ఎయిర్‌‌‌‌లైన్స్‌‌కు వెళ్లడం భవిష్యత్తులో జెట్‌‌కు రెక్కలు లేకుండా పోతాయేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్జాతీయ రూట్లలో అడ్వాన్స్ బుకింగ్స్‌‌ బంద్

జెట్ ఎయిర్‌‌‌‌వేస్‌‌ అంతర్జాతీయ రూట్ల కార్యకలాపాలు కూడా పునరుద్ధరించుకునేటట్టు కనిపించడం లేదు. కొన్ని ఇంటర్నేషనల్  సెక్టార్లలో అడ్వాన్స్ బుకింగ్‌ లను జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్ ఆపివేసింది. కొలంబో,కఠ్మాండు, సింగపూర్, హాంకాంగ్ వంటి సార్క్, ఆసియన్ మార్గాలకు అడ్వాన్స్ బుకింగ్‌లను తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు ఆపివేస్తున్నామని  కంపెనీ, దేశీయ ఏవియేషన్ రెగ్యులేటరీకి తెలిపింది. ప్రతీది కూడా క్యాపిటల్ ఇన్‌ ఫ్యూజన్‌ పైనే ఆధారపడి ఉండటంతో సార్క్, ఆసియన్ రూట్లకు ఆపివేసిన అడ్వాన్స్ బుకింగ్స్‌‌ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో  ఇంకా క్లారిటీ లేదని ఎయిర్‌‌‌‌లైన్‌ వర్గాలు చెప్పాయి.