- ఈడీ సమన్ల వ్యవహారంపై హాజరైన హేమంత్ సోరేన్
రాంచీ: భూ కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను ధిక్కరించిన వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ శనివారం రాంచీలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వ్యక్తి గతంగా హాజరయ్యారు. నిర్ణీత సమయం మధ్యాహ్నం 2 గంటలు అయినప్పటికీ, సీఎం టైం కంటే ముందుగానే మధ్యాహ్నం 12:45 గంటలకే కోర్టుకు చేరుకున్నారు. సుమారు 30 నిమిషాల విచారణ అనంతరం మధ్యాహ్నం 1:15 గంటలకు ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా హేమంత్ సోరేన్ రెండు వేర్వేరు కేసుల్లో రూ.7 వేలు చొప్పున మొత్తం రూ.14 వేలు విలువైన రెండు బెయిల్ బాండ్లను కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆయన హాజరును నమోదు చేసుకుని, విచారణను ఈ నెల12కి వాయిదా వేసింది. సోరేన్ తరపు న్యాయవాది ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ..జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు సీఎం శనివారం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారని తెలిపారు.
ఇకపై సీఎం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఓ భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరేన్‌ను విచారించడానికి ఈడీ పలుమార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ సోరేన్ సమన్లకు స్పందించలేదు. విచారణకు హాజరు కాలేదు. దాంతో ఈడీ రాంచీలోని ఎంపీ-ఎంఎల్ఏ స్పెషల్ కోర్టులో కంప్లైంట్ వేసింది.
పిటిషన్ పై కోర్టు స్పందిస్తూ..సోరేన్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. దాంతో ఆయన జార్ఖండ్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు స్పందిస్తూ..వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నాం..కానీ 6న ఒక్కసారి మాత్రం ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరై, బెయిల్ బాండ్ ఇచ్చి రావాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సోరెన్ కోర్టుకు వ్యక్తిగతంగా అటెండ్ అయ్యారు.
