బలపరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ విజయం

బలపరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ విజయం

జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ విజయం సాధించారు. సోరెన్ సర్కార్‌కు 48 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మెజారిటీ నిరూపణకు 42 సీట్లు అవసరం. బలనిరూపణ కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ మొదలైన కాసేపటికే విశ్వాసపరీక్ష తీర్మానాన్ని సీఎం హేమంత్ సోరెన్  ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాసేపు దీనిపై చర్చించారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించగా.. సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. దీంతో విశ్వాస పరీక్షలో సోరెన్ సర్కారు విజయం సాధించినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో  వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

పరీక్షకు ముందు ఎమ్మెల్యేలకు లేఖ
అసెంబ్లీలో బల నిరూపణకు ముందు సీఎం సోరెన్ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా అనిశ్చితి నెలకొందని..దానికి తెర దించాలంటే విశ్వాస పరీక్ష ఒక్కటే మార్గమని భావించినట్లు చెప్పారు.  కన్‌ఫ్యూజన్‌ పై గవర్నర్‌ను కలిసినా ఫలితం లేకుండా పోయిందని..అందుకే అసెంబ్లీ సెషన్‌ నిర్వహించి బలం నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నామని లేఖలో పేర్కొన్నారు. 

రిసార్ట్ కు ఎమ్మెల్యేల తరలింపు..
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ పై  ఎన్నికల కమిషన్ సూచన మేరకు  గవర్నర్ రమేష్ బెయిస్ అనర్హత వేటు వేశారు. దీంతో బీజేపీపై సీఎం సోరెన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ రిసార్టుకు తరలించారు. బలపరీక్ష నేపథ్యంలో 30 మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు.