
- ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నరు
- మా బలమేంటో అసెంబ్లీలో చూపించినం
- జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ నెగ్గారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 48 మంది ఆయనకు మద్దతిచ్చారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి 29, కాంగ్రెస్ నుంచి 15, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐఎంఎల్(ఎల్) నుంచి ఒక్కో ఎమ్మెల్యే, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు మొత్తం 48 మంది హేమంత్ సోరెన్‌కు అనుకూలంగా ఓటేశారు. యూపీఏ కూటమికి మొత్తం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. విశ్వాస పరీక్ష ఓటింగ్‌కు ముందు సీఎం హేమంత్ సోరెన్ ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయన మండిపడ్డారు. దీంతో ఓటింగ్‌కు ముందే.. బీజేపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు.
సరుకుల్లాగా ఎమ్మెల్యేలను కొనాలనుకున్నరు
విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడారు. ప్రతిపక్ష బీజేపీ.. జార్ఖండ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీలో తమ బలమేంటో నిరూపితమైందన్నారు. ‘‘ప్రజలు మార్కెట్లో బట్టలు, రేషన్, కిరాణా సరుకులు కొంటారని విన్నాం. కానీ బీజేపీ మాత్రం అంగట్లో సరుకుల్లా.. ఎమ్మెల్యేలను కొనేందుకు చూస్తున్నది” అని సోరెన్ విమర్శించారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన బీజేపీ.. ఓ గిరిజన సీఎంను పదవి నుంచి దించేందుకు ప్రయత్నించిందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
బీజేపీయేతర రాష్ట్రాలే టార్గెట్అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం టార్గెట్ చేస్తోందని హేమంత్ సోరెన్ విమర్శించారు. జార్ఖండ్‌లోనూ అలాగే వ్యవహరించిందన్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనేందుకు అస్సాం సీఎం హిమంత బిస్వశర్మ ఎంతో ప్రయత్నించారన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు ఆయన కారణం అవుతున్నారని విమర్శించారు. తన రాష్ట్ర పాలన చూసుకోకుండా.. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు హిమంత ఆటలు సాగవని హెచ్చరించారు.