సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్.. ఇక నుంచి 50ఏళ్లకే పెన్షన్..

సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్.. ఇక నుంచి 50ఏళ్లకే పెన్షన్..

వృద్ధాప్య పెన్షన్లపై జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న అర్హత వయస్సును 60 నుండి 50 సంవత్సరాలకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఇకనుంచి రాష్ట్రంలోని గిరిజనులు, దళితులు 50 ఏళ్లు నిండితే పింఛను పొందేందుకు అర్హులవుతారన్నారు. రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాంచీలోని మొరాబాదీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోరెన్ ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా, రాష్ట్రంలో కార్యాలయాలు ఏర్పాటు చేసే కంపెనీలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను తమ ప్రభుత్వం రిజర్వ్ చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.

గిరిజనులు, దళితులకు 50 ఏళ్లు నిండితే పింఛన్‌ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని, 60 ఏళ్లు దాటినా వారికి ఉద్యోగాలు రావడం లేదని సోరెన్ వాదించారు. 2000లో జార్ఖండ్‌ ఏర్పడిన తర్వాత ఈ 20 ఏళ్లలో కేవలం 16 లక్షల మంది మాత్రమే పెన్షన్‌ ప్రయోజనాలు పొందారని, అయితే తమ ప్రభుత్వం 36 లక్షల మందికి పింఛను అందించిందని చెప్పారు. అందులో ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే పింఛను అందజేసిందని ముఖ్యమంత్రి తెలిపారు.

తమ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో 60 ఏళ్లు పైబడిన 36 లక్షల మందికి, 18 ఏళ్లు పైబడిన వితంతువులకు, శారీరక వికలాంగులకు పింఛను అందజేశామన్న సీఎం సోరెన్.. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పని చేస్తోందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందజేసేలా తమ ప్రభుత్వం చేపట్టిన ‘ఆప్కీ యోజన, ఆప్కీ సర్కార్, ఆప్కే ద్వార్’తో సహా పెద్ద సంఖ్యలో పథకాలు తొలిసారిగా అమలవుతున్నాయని సోరెన్ చెప్పారు.