కొవిడ్​ అలర్ట్.. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 3 కేసులు

కొవిడ్​ అలర్ట్.. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 3 కేసులు
  •     అప్రమత్తమైన హెల్త్​ డిపార్ట్​మెంట్​
  •     ప్రధాన ఆసుపత్రుల్లో స్పెషల్​ వార్డులు
  •     అందుబాటులోకి ర్యాపిడ్​ టెస్ట్​ కిట్​లు

మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: వెళ్లి పోయిందనుకున్న కొవిడ్ మళ్లీ వచ్చింది.  జేఎన్1 వేరియంట్​ వేగంగా వ్యాపిస్తోంది. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే  పాజిటివ్​ కేసులు నమోదు కావడంతో అలర్టయిన  మెడికల్,  హెల్త్ డిపార్ట్​ మెంట్ పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో  స్పెషల్ వార్డు లు ఏర్పాటు చేసింది.  టెస్ట్​ల కోసం ర్యాపిడ్​ కిట్లు   అందుబాటులో ఉంచుతున్నారు. 

సంగారెడ్డిలో రెండు కేసులు  

సంగారెడ్డి జిల్లాలో రెండు కేసులు కొవిడ్​ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.  శుక్రవారం నాటికి  జిల్లాలోని పటాన్ చెరు,  రామచంద్రపురంలో ఒక్కొక్కరికి  కరోనా పాజిటివ్​ ఉన్నట్టు  వైద్యాధికారులు గుర్తించారు. ఇంకా నాలుగు కేసులు ఉన్నాయని,  వైద్యాధికారులు మాత్రం ధ్రువీకరించలేదని తెలుస్తోంది. కొత్త వేరియంట్​ ప్రబలుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో వైద్యాధికారులను అలర్ట్ చేసింది. కరోనా టెస్టులు పెంచడంతోపాటు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశించింది. కొవిడ్​ లక్షణాలున్నట్టు అనుమానం ఉన్నవారు  ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో టెస్టులు చేయించుకుంటున్నారు. 

సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్​లో 200 ఆక్సిజన్ బెడ్స్,  ఐదు ప్రాంతీయ దవాఖానల్లో  70  చొప్పున,  ఐదు పీహెచ్​సీల్లో  30  చొప్పున బెడ్లతో కొవిడ్​ వార్డులు ఏర్పాటు చేశారు.  జిల్లావ్యాప్తంగా 22 ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొవిడ్ ట్రీట్​మెంట్​ అందనుంది,  జిల్లాకు చెందిన  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో మాట్లాడుతున్నారు.   కర్నాటక, మహారాష్ట్ర  నుంచి ప్రజలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రోజూ వచ్చిపోతుంటారు కాబట్టి  బార్డర్లలో  చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి.. పరీక్షలు చేయాలని  ప్రజలు కోరుతున్నారు.

సిద్దిపేటలో ఐసోలేషన్​ వార్డు ఏర్పాటు  

కరోనా వైరస్ మళ్లీ  ప్రబలుతుండడంతో  సిద్దిపేట జిల్లాలో యంత్రాంగం  అప్రమత్తమైంది.  జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్​సీ,  యుపీహెచ్​సీల్లో టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచారు.  పది వేల రాపిడ్ కిట్లను తెప్పించిన అధికారులు..   ఆర్టీపీసీఆర్ పరీక్షలకు కూడా ఏర్పాట్లు చేశారు.  సిద్దిపేట జీజీహెచ్ లో ఒక   పాజిటివ్ కేసు రావడంతో  జీజీహెచ్ లో ఐదు బెడ్ల తో స్పెషల్​గా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు.  జ్వరంతో వచ్చిన వారికి  కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు. జిల్లాలోని వైధ్యాధికారులు, సిబ్బందితో డీఎంహెచ్ వో కాశీనాథ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి  పరిస్థితులను సమీక్షించారు. ఒకటి రెండు రోజుల్లో  రాపిడ్ కిట్లు వస్తాయని, వాటిని 24 పీహెచ్​సీలకు పంపుతామని  చెప్పారు. సిద్ధిపేట లో ఆక్సిజన్ ప్లాంట్​,  గజ్వేల్ లో ఆక్సిజన్  జనరేటింగ్ యూనిట్ ఉండగా, ఇతర దవాఖానాల్లో  ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు  అందుబాటులో ఉంచనున్నారు.  

ఆక్సిజన్​ బెడ్లు రెడీ

 కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెదక్​ జిల్లాలోనూ అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. మెదక్​లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నర్సాపూర్​, రామాయంపేట, తూప్రాన్​ ఏరియా ఆసుపత్రుల్లో  స్పెషల్​ వార్డులు ఏర్పాటు చేశారు. మెదక్ లో 100 ఆక్సిజన్​, 10 ఐసీయూ బెడ్లు,  నర్సాపూర్​లో 100, తూప్రాన్​, రామాయంపేటలో 50 చొప్పున ఆక్సిజన్​ బెడ్లు  అందుబాటులో ఉంచారు. అన్ని పీహెచ్​సీలలో కరోనా టెస్ట్​లు చేస్తున్నారు.  

కొవిడ్​ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా  టెస్ట్​ చేసుకోవాలని  అధికారులు సూచిస్తున్నారు.  ఈనెల 25న  క్రిస్మస్​వేడుకలకు   మెదక్ లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేథడ్రాల్ చర్చ్ కు  వివిధ ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది  వస్తారు. భారీగా జనం వస్తున్నందున అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేడుకలకు వచ్చే భక్తులకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పించనున్నారు.