- జేఎన్టీయూ విద్యార్థుల ఆవేదన
- హైకోర్టు జడ్జికి పోస్టుకార్డులు
కూకట్పల్లి, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలను విద్యార్థులే చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని జేఎన్టీయూ ప్రొటెక్షన్ఫోరమ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వారు హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవికి పోస్టుకార్డులు రాసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రైవేటు కాలేజీలు లక్షల రూపాయల ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని, రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య తల్లిదండ్రులు ఇంత భారీ మొత్తంలో ఫీజులు చెల్లించే స్తోమత లేక అవస్థలు పడతారని నాయకులు దిలీప్, రాహుల్ నాయక్ వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బాధ్యతను ప్రభుత్వమే తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో సాగర్ నాయక్, రాజ్ కుమార్ సహా పలువురు విద్యార్థి నేతలు పాల్గొన్నారు.
హైకోర్టు తీర్పు సరికాదు: ఏఐఎస్ఎఫ్
మేడిపల్లి: ఫీజు బకాయిలను విద్యార్థులే చెల్లించాలన్న హైకోర్టు తీర్పు సరైనది కాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం ఉప్పల్లో జరిగిన జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి ఉన్నారని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ ఫీజులు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
