టీ20, వన్డేలకు కెప్టెన్గా జోస్ బట్లర్

టీ20, వన్డేలకు కెప్టెన్గా జోస్ బట్లర్

వరుస సెంచరీలతో ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జోస్ బట్లర్కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రమోషన్ ఇచ్చింది. అతన్ని వన్డే, టీ20 కెప్టెన్గా ఎంపిక చేసింది. క్రికెట్ కు మోర్గాన్ వీడ్కోలు పలకడంతో ..బట్లర్ ను సారథిగా ఈసీబీ నియమించింది. గత కొద్ది కాలంగా నిలకడగా రాణిస్తున్న బట్లర్..మోర్గాన్కు సరైన వారసుడని బోర్డు పేర్కొంది. 

జులై 1 నుంచి ఇంగ్లాండ్ టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. దీని తర్వాత భారత్తోనే ఇంగ్లాండ్ టీ20 సిరీస్, వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. జులై 7 నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సిరీస్తోనే బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. అయితే ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో..బట్లర్ ఆ దిశగా జట్టును నడిపిస్తాడని కోచ్ మాథ్యూ మోట్ వెల్లడించాడు. వరల్డ్ కప్ గెలుపే టార్గెట్గా తమ ప్రణాళికలు ఉంటాయని తెలిపాడు. 

వన్డే, టీ20 కెప్టెన్గా ఎంపికవడం పట్ల బట్లర్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఇది అత్యంత గౌరవమని చెప్పుకొచ్చాడు. తనపై నమ్మకముంచి కెప్టెన్సీ అప్పగించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు బట్లర్  కృతజ్ఞతలు తెలిపాడు. మాజీ కెప్టెన్ మోర్గాన్కు బట్లర్ ధన్యవాదాలు చెప్పాడు. మోర్గాన్ వారసత్వాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చాడు.