కథలో ఓ జర్నలిస్టుంటే ఆ కిక్కే వేరప్పా

కథలో ఓ జర్నలిస్టుంటే ఆ కిక్కే వేరప్పా

మీడియా… పలకడానికి మూడే అక్షరాలు. దానికున్న శక్తి‌‌ ఏపాటిదో చెప్పడానికి మాత్రం ఉన్న అక్షరాలు చాలవు. కానీ రెండున్నర గంటల సినిమా సరిపోతుంది అంటారు ఫిల్మ్ మేకర్స్‌. వారంతా మీడియాని కథలో భాగం చేసి… హీరోనో హీరోయిన్‌నో జర్నలిస్టును చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జర్నలిజం పవర్‌‌‌‌ని చూపించారు.

వాటిలో ఇవి కొన్ని …
అతడో జర్నలిస్ట్. ఎక్కడ తప్పు జరిగినా ఠక్కున పట్టేస్తా డు. కానీ ఎవరో చేసిన తప్పు వల్ల తాను జైలు పాలవుతాడు. మోసగాడిగా నిందల పాలవుతాడు. ఆ నిందను చెరిపేసుకునే క్రమంలో ఓ పెద్ద స్కామ్‌ గురించి తెలుసుకుంటాడు. దాని వెనుక ఉన్నవాళ్లను పట్టుకుని … తననే కాదు, తనలా బలైన మరెందరికో న్యాయం చేస్తాడు. జర్నలిస్టు సత్తా చాటుతాడు. అందుకే ‘అర్జున్‌ సురవరం’ అందరికీ నచ్చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ఈ సినిమా మీడియా పవరేంటో చూపించిందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సినిమా లు గతంలో కూడా చాలా వచ్చాయి.

అందరూ అందరే!
ఒక వార్త బైటికెళ్లాక సంచలనాన్ని సృష్టిం చొచ్చు. వివాదాల్ని రేపవచ్చు. అందుకే జర్నలిస్టు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చెబుతుంటారు. అలా ప్రవర్తించే ఇన్‌‌స్పిరేషనల్, ఇన్‌‌స్పైరింగ్ జర్నలిస్టులు మన సినిమాల్లో చాలామంది కనబడుతుంటారు. రాజకీయాల్లో ఎదగడం కోసం తప్పుడు దారి తొక్కిన ప్రాణ స్నేహితుడిపైనే పోరాటానికి ‘రంగం’ సిద్ధం చేశాడు జీవా. రూమ్ నంబర్ ‘118’లో పడుకున్నప్పుడు తన కలలోకి వచ్చిన అమ్మాయి కోసం వెతుకుతూ ఓ పెద్ద రహస్యాన్నే కనిపెట్టాడు కళ్యాణ్‌ రామ్. ఓ మంచి పని కోసం ప్రాణాలే పోగొట్టుకున్న ఆ అమ్మాయికి న్యాయం చేసి ప్రశంసలు మూటగట్టుకున్నాడు అతనిలోని జర్నలిస్టు. అవినీతి సామ్రాజ్యాన్ని హద్దుల్లేకుండా విస్తరింపజేసిన గ్యాంగ్‌ స్టర్‌‌‌‌ జావెద్ ఇబ్రహీమ్‌‌ని ‘ఇజం’లో వేటాడి మెప్పించింది కూడా అతనే. గంగతో కలిసి రాంబాబు అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టించాడు.

సెన్సేషనల్ జర్నలిజం ముసుగులో దాగున్న రహస్యాలను సుమంత్‌ ‘ఇదం జగత్’ అంటూ వెలుగులోకి తెచ్చాడు. ‘మహానటి’ జీవితంలోని పలు కోణాలను వెలికి తెచ్చే క్రమంలో ఒక జర్నలిస్టుగా సమంత కష్టపడింది. ఆమెను ప్రేమించే ఫొటో జర్నలిస్టుగా విజయ్ దేవరకొండ సాయం ఆమెకు తోడయ్యింది. ‘ఒకే ఒక్కడు’లో అర్జున్‌‌ జర్నలిస్టు పవర్‌‌‌‌ చూపించి ముఖ్యమంత్రి పదవి వరకూ ఎదిగిన వైనాన్ని ఎవరు మరువగలరు! ‘పత్రమ్‌‌’లో సురేష్‌ గోపి, ‘రన్‌‌ బేబీ రన్‌‌’లో మోహన్‌‌లాల్, ‘రాన్‌‌’లో అమితాబ్, ‘అలీఘడ్‌ ’లో రాజ్‌ కుమార్‌‌‌‌ రావ్.. అందరూ జర్నలిస్టు పాత్రల్ని పోషించారు. జర్నలిజం పవరేంటో ప్రేక్షకులకు చూపించారు.

అమ్మాయిలూ తగ్గట్లా !
రిస్క్ అధికంగా ఉండే ప్రొఫెషన్స్‌లో జర్నలిజం కూడా ఉంది. అయినా మీడియాలో పని చేసే అమ్మాయిల సంఖ్య అధికంగానే ఉంది. అందుకేనేమో.. సినిమాల్లో కూడా జర్నలిస్ట్ పాత్రల్లో ఎక్కువగా హీరోయిన్లే కనిపిస్తుంటారు. ‘మహానటి’లో మనసున్న జర్నలిస్ట్‌గా మెప్పించిన సమంత.. ‘యు టర్న్‌‌’లో డేరింగ్‌ రిపోర్టర్‌‌‌‌గా నటించింది. ‘పేజ్‌ 3’ పీపుల్‌ జీవితాల్లోని చీకటి కోణాలను కొంకణాసేన్ శర్మ బయటపెట్టింది. ‘నో ఒన్‌‌ కిల్డ్‌ జెస్సికా’ అంటూ జెస్సికాలాల్‌ కేసును పక్కదారి పట్టిస్తుంటే… ఆమెను చంపిన కిరాతకుల్ని రాణీముఖర్జీ చట్టానికి పట్టించి మీడియా ఏం చేయగలదో చూపించింది. సమాజాన్ని పాడు చేస్తున్న చీడపురుగులకు వ్యతిరేకంగా అమితాబ్, అజయ్‌ దేవగన్‌‌లు చేసిన సత్యాగ్రహానికి కరీనా ఊతమిచ్చింది.

ఇతర గ్రహం నుంచి వచ్చిన వ్యక్తిలోని మహోన్నత వ్యక్తిత్వాన్ని అనుష్కాశర్మ ‘పీకే’లో పరిచయం చేసింది. ‘కృష్ణం వందే జగద్గురుం’ అంటూ నయనతార వస్తే ప్రేక్షకులు ఆహ్వానం పలికారు. చార్మి ‘ప్రతిఘటన’ను ప్రశంసించారు. ‘మగలిర్ మట్టుమ్’లో జ్యోతిక ప్రతిభకు పట్టం కట్టారు. స్ట్రింగ్ ఆపరేషన్లు చేయడంలో ‘అనసూయ’ ప్రతిభను మెచ్చారు. ‘గాయత్రి’ని తండ్రి దగ్గరకు చేర్చిన అనసూయనూ ఆదరించారు. ‘నాకవుట్’ చేసిన కంగనాని, ‘మద్రాస్‌‌ కేఫ్‌ ’ కేంద్రంగా అడ్వెంచర్స్ చేసిన నర్గీస్‌‌ ఫక్రీని మెచ్చుకున్నారు. ‘నూర్‌‌‌‌’గా సోనాక్షి నచ్చిందన్నా రు. ఒకటీ రెండూ కాదు… ఇలా ఎన్నో సినిమాలో హీరోయిన్లు పవర్‌‌‌‌ఫుల్ జర్నలిస్టులుగా కనిపించారు. పూలలా సున్నితంగా ఉంటాం, తేడా వస్తే ముళ్లై దిగుతాం అంటూ నిరూపించారు.

జర్నలిజం కేరాఫ్ సెన్సేషనలిజం
జర్నలిజం చుట్టూ సినిమాలు నడపడంలో హాలీవుడ్‌ తీరే వేరు. ఒక జర్నలిస్టు పాత్రతో పెద్ద పెద్ద స్కామ్స్‌ని సైతం బైట పెట్టించడం, బడా రాజకీయవేత్తలకు కూడా చెమటలు పట్టిం చడం వారికే చెల్లింది. బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తలెత్తిన ఓ వివాదం ఆధారంగా తీసిన ‘ట్రూత్’, రోమన్‌‌ క్యాథలిక్ మతాధికారులు చిన్నారులను వేధించే కాన్సెప్ట్‌తో తెరకెక్కి ఆస్కార్ అవార్డును పొందిన ‘స్పాట్‌‌లైట్’, ఓ బ్రాడ్‌ కాస్ట్ జర్నలిస్టుకి, యూఎస్ సెనేటర్‌‌‌‌కి మధ్య నడిచిన కాంట్రవర్శీని చూపించిన ‘గుడ్ నైట్ అండ్ గుడ్ లక్’, జర్నలిజంలోని ఫ్రాడ్‌‌ని బైటపెట్టిన ‘షాటర్డ్​ గ్లాస్’, ఒక మర్డర్ మిస్టరీ‌ని ఛేదించడంలో మీడియా పర్సన్స్ చేసిన కృషిని చూపెట్టిన ‘స్టేట్ ఆఫ్ ప్లే’ వాటర్‌‌‌‌గేట్ స్కాండల్ చుట్టూ తిరిగే ‘ఆల్‌ ద ప్రెసిడెంట్స్ మెన్’, యాక్సిడెంటులు కవర్ చేయబోయి యాక్సిడెంటల్​గా పెద్ద స్కామ్ బైట పెట్టే ‘నైట్ క్రాలర్ ’ వంటి చిత్రాలు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇంకా ఎన్నో జర్నలిజం బేస్డ్​ మూవీస్ వచ్చాయక్కడ. జర్నలిజంలో సెన్సేషనలిజం ఎంత అవసరం, ఆ రెండూ ఎలా ముడిపడి ఉంటాయనేది ఆ సినిమాలు చక్కగా చూపించాయి.

‘సాగర సంగమం’లో కమల్‌‌ ఏం చేస్తాడు అంటే డ్యాన్స్​ అని ఠక్కున చెప్పేస్తారు. కానీ అందులో కమల్ జర్నలిస్ట్‌గా కూడా పని చేస్తాడు. ఆ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే సీన్ ఒకటుంది. డ్యాన్స్‌ గురించి నీకేం తెలుసు అని అవమానించిన శైలజకి.. కమల్ హాసన్ అన్ని రకాల డ్యాన్సులూ చేసి చూపించే సన్ని వేశాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే ఆ సీన్‌ ఏ సందర్భంలో వస్తుందో తెలుసుగా. తన డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ గురించి కమల్ పేపర్‌‌‌‌లో తప్పుగా రాస్తే నిలదీయడానికి శైలజ వచ్చినప్పుడు అదంతా జరుగుతుంది. ఇదే విధంగా చాలా సినిమాల్లో మెయిన్‌ థీమ్ వేరే ఉన్నా.. కొన్ని సన్ని వేశాల్లో మీడియా పవర్‌‌‌‌ కనిపిస్తూ ఉంటుంది. అందులో హీరో హీరోయిన్లే నటించాలని లేదు. సైడ్ క్యారెక్టర్లో , కమెడియన్సో కూడా కనిపించొచ్చు. ‘కల్కి’లో రాహుల్ రామకృష్ణ రిపోర్టర్. కామెడీ పండించినా అతని పాత్ర ఆ సినిమాకి కొత్త మలుపులు ఇస్తుంది. ‘ఏజెంట్​ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో హీరో ఫ్రెండ్ కూడా జర్నలిస్టే. అతనికి మెయిన్​ లైన్​తో సంబంధం ఉండదు. కానీ హీరోకి అవసరమైనప్పుడు ఆ పాత్ర అప్పుడప్పుడు వచ్చి పోతుంటుంది. ఇలాంటి రోల్స్ చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి.

మీడియా పవర్ ని చూపించడమే లక్ష్యంగా అల్లుకున్న కథలు కొన్ని. అసలు కథలకు కొసరుగా మీడియా బలాన్ని యాడ్ చేసి తెరకెక్కించినవి కొన్ని. వాటిని ఆసక్తికరంగా చూపిస్తే విజయం వరించింది. చూపించలేకపోయినప్పుడు ఓటమి పలకరించింది. విశేషమేమిటంటే, ఆ సినిమా హిట్టయినా ఫెయిలయినా.. ఆ విషయాన్ని ప్రజలకు మీడియానే చేరవేసింది!