దశాబ్దంలోకి తెలంగాణ.. కాలం మరిచిన కలం యోధుడు

దశాబ్దంలోకి తెలంగాణ.. కాలం మరిచిన  కలం యోధుడు

తన కలం ద్వారా ప్రజలను కదిలిస్తూ.. దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం జైలుకు వెళ్లి, తుది శ్వాస వరకూ పోరాడిన ఓ జర్నలిస్ట్​ను కాలం గుర్తించలేదు. చరిత్ర లిఖించలేదు. నిజాం పాలన అరాచకాలపై, ఆంధ్రా వలస పాలన కుట్రలపై ఆయన చేసిన పోరాటానికి సరైన గుర్తింపు లభించలేదు. తొలిదశ తెలంగాణ పోరాటంలో ముందు వరుసలో కొట్లాడినా.. ఎక్కడా ఆయన పేరు కనిపించదు.. వినిపించదు. ఆ అజ్ఙాతవ్యక్తి మరెవరో కాదు.. వెంకటేశ్​ హనుమంతరావు దేశాయి (వీహెచ్​ దేశాయి).


హైదరాబాద్​ స్టేట్​లోని కర్నాటక ప్రాంతంలో ఉండే ఓ సాధారణ కుటుంబం  హైదరాబాద్​కు వచ్చింది. ఆ కుటుంబంలో నాలుగో సంతానంగా 1925లో పుట్టిన వ్యక్తే వీహెచ్​ దేశాయి. హైదరాబాద్​లోనే నృపతుంగా స్కూలులో పాఠశాల విద్యను పూర్తి చేసి, చాదర్​ఘాట్​ గవర్నమెంట్​ కాలేజీలో చేరిన దేశాయి.. జాతీయోద్యమం బలంగా జరుగుతున్న ఆ రోజుల్లో స్వామి రామనందతీర్థ నిర్మిస్తున్న ప్రజా ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. 1942లో గాంధీజీ ‘క్విట్​ఇండియా’ పిలుపునకు స్పందిస్తూ.. తన తోటి విద్యార్థులను కూడకట్టుకొని విద్యార్థి సంఘాలను నిర్మించారు. బ్రిటిష్ ​పాలకులకు వ్యతిరేకంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించి ఉద్యమాలు లేవదీశారు. దీంతో కాలేజీ యాజమాన్యం ఆయనను కాలేజీ నుంచి సస్పెండ్ ​చేసింది. నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ ​సంస్థానంలో జాతీయోద్యమంలో భాగంగా.. నిజాం రాక్షస, దుష్ట పాలనకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించారు దేశాయి.

స్వాతంత్ర్యోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూనే పత్రికా రచయితగా1944లో ‘డెక్కన్​క్రానికల్’లో చేరి రిపోర్టర్​గా, సబ్​ఎడిటర్​గా పనిచేశాడు. 1947లో స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో జాతీయోద్యమం తారాస్థాయికి చేరిన సమయంలో నిజాం ప్రభుత్వం దాన్ని అణచివేయడానికి అప్పటికి హైదరాబాద్​స్టేట్​కాంగ్రెస్​అధ్యక్షుడిగా ఉన్న స్వామి రామానంద తీర్థను, బూర్గుల రామకృష్ణారావును, జీఎస్​ మెల్కోటేను, మర్రి చెన్నారెడ్డిని, కేఎస్​వైద్య, పండిట్​నరేంద్రతోపాటు వీహెచ్​ దేశాయిని అరెస్ట్​చేసి హైదరాబాద్​సెంట్రల్​ జైలులో పెట్టింది. అక్కడి నుంచి వారిని కాళోజీ నారాయణ రావు, జగన్నాథరావు తదితర 500 మందిని1948 ఏప్రిల్​లో గుల్బర్గా సెంట్రల్​జైలుకు మార్చారు. 1948 సెప్టెంబర్​17న హైదరాబాద్​సంస్థానంలో త్రివర్ణ పతాకం ఎగిరిన నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్​22న అందరూ రిలీజ్​అయ్యారు. భారత ప్రభుత్వం ‘తామ్రపత్ర’ అనే ప్రశాంసాపత్రాన్నిచ్చి సత్కరించిన వారిలో వీహెచ్​ దేశాయి ఉన్నారు. 

జైలులో పత్రిక..

ది డెమోక్రట్జైలులో ఉన్న సమయంలోనే 1948 జనవరి 26న వీహెచ్​దేశాయి ‘ది డెమోక్రట్’ అనే పత్రికను ప్రారంభించారు. రాత్రంతా కూర్చొని తన చేతి రాతతో వార్తలు రాసి, దానికి సంబంధించిన బొమ్మలు గీసి, ఇంగ్లిష్​ భాషలో పత్రికను జైలు అధికారులకు తెలియకుండా రహస్యంగా నడిపారు. అప్పటికే జైలులో ఉన్న దేశభక్తుల్లో దాశరథి కృష్ణమాచార్యులు, పండిట్​నరేంద్రజీ, బిద్రీచంద్, కంది శ్రీనివాస్​రావు, నరేంద్ర ప్రసాద్​సక్సేనా, కామ్రేడ్ ఏఆర్ వీ చారి, దత్తాత్రేయ ప్రసాద్, బొజ్జం నరసింహులు తదితరులు ‘ది డెమోక్రట్’లో వ్యాసాలు రాసేవారు. ఈ పత్రికను ఒకరు చదివిన తర్వాత మరొకరు చదివేవారు. ‘‘మనం చేస్తున్న పోరాటం సామన్యమైనది కాదు.. భారత స్వాతంత్ర్య సమరంలో ఆఖరు ఘట్టం. తుపాకీ గుండు నా గుండెలో దూరి నేను ప్రాణం వదిలే సమయంలో కూడా స్వాతంత్ర్య పతాకాన్ని పట్టుకునే ఉంటా”అంటూ స్టేట్​కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ ఇచ్చిన సందేశాన్ని దేశాయి ‘ది డెమోక్రట్’ 1948 జులై 16 సంచికలో ప్రచురించి నాయకుల్లో స్ఫూర్తి నింపారు. జైలులో పత్రిక ద్వారా ఎన్నో విషయాలపై నాయకుల్లో చైతన్యం తీసుకువచ్చిన దేశాయి.. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ‘ది డెమోక్రటిక్’ను హైదరాబాద్​స్వాతంత్ర్య సమరంలో అమరులైన వీరులకు అంకితం చేశారు. 

‘బంధిఖానలో బంధింప బడిగూడ
కలము బలము చూపగలిగినాడు
వ్రాత పత్రికను నిరాటంక పథమున
నడిపి గుండె బలము నిడినవాడు’
‘త్యాగ ధనుడతండు; తన జీవితమ్మును
జాతి కంకితమ్ము సలిపినాడు;
పదవి కోరలేదు; స్వాతంత్ర్య సమరాన
వీరసైనికుడయి వెలిసినాడు’
అని .. దాశరథి కృష్ణమాచార్యులు వీహెచ్​దేశాయి ఔన్నత్యాన్ని కొనియాడారు. ‘దేశాయికి సహచరుణ్ని కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ కోసం ఇందిరను కలిసి..

పోలీస్ ​యాక్షన్ ​తర్వాత నాలుగేండ్లకు హైదరాబాద్‌ శాసనసభకు మొదటిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ మొత్తం175 స్థానాలకు173 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. వాటిలో 93 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ పూర్తి మెజారిటీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 42 స్థానాలతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ప్రతిపక్ష కూటమిగా నిలిచింది. 1952, మార్చి 6న బూర్గుల రామకృష్ణారావు సీఎంగా హైదరాబాద్‌లో తొలి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్​అవతరణ జరిగింది. ఆ సమయంలో ఆంధ్రాను తెలంగాణతో కలిపే సమయంలో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం అంశాలు అమలుకు నోచుకోకపోవడం, ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ వారి కింద శిక్షణ పొందిన అనుభవం ఉన్న అధికారులను తెలంగాణకు రప్పించడం, అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇవ్వడం, స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరంకావడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నిప్పు రాజుకుంది. మర్రి చెన్నా రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం వీహెచ్ దేశాయి ఓ పోరాట వేదికను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే ఎంపీలుగా ఉన్న జీఎస్​మేల్కోటే, జి. వెంకటస్వామి(కాకా) నేతృత్వంలో వీహెచ్​ దేశాయి బృందం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి ఇందిరాను కలిశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రిప్రెజంటేషన్​అందజేసి, సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ సఫరర్స్​వెల్ఫేర్​కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్​ఫ్రీడం ఫైటర్స్​ఫోరమ్(1972)​కు ఫౌండర్​ ప్రెసిడెంట్​గా పనిచేశారు. ఆలిండియా ఫ్రీడం ఫైటర్స్​ అసోసియేషన్​కు జనరల్​సెక్రటరీగా చేశారు. కొండా లక్ష్మణ్​ బాపూజీ, కాళోజీ నారాయణ రావు, కొత్తపల్లి జయశంకర్, రావి నారాయణ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పీవీ నర్సింహారెడ్డి లాంటి నేతలతో కలిసి తెలంగాణ ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేశారు.

గ్రంథాలు– అవార్డులు

సంపాదకుడిగా దేశాయి కొన్ని ముఖ్యమైన గ్రంథాలు రాశారు. సాగా ఆఫ్ ​ఆజాద్ ​హింద్ ​మొదటి బుక్​ కాగా, వందే మాతరం టు జనగణమన,  సాగా ఆఫ్​ హైదరాబాద్​ ఫ్రీడమ్​స్ట్రగుల్, అన్​టోల్డ్​స్టోరీ ఆఫ్​ఏ జైల్​జర్నల్– ది డెమోక్రట్ ​పుస్తకాలు తీసుకొచ్చారు. 1800 నుంచి 1956 వరకు చరిత్ర ప్రసిద్ధికెక్కిన హైదరాబాద్​ సంస్థాన విమోచనోద్యమ చరిత్రను స్వామి రామానందతీర్థ మెమోరియల్​కమిటీ వారు గ్రంథ రూపంలో తీసుకువచ్చే బాధ్యతలను దేశాయికి అప్పగించగా ఆయన దాన్ని విజయవంతంగా నిర్వహించారు. భవన్స్​ కాలేజీ ఆఫ్​ మాస్ ​కమ్యూనికేషన్​అండ్​ మేనేజ్​మెంట్​కు దేశాయి ప్రిన్సిపల్​గా పనిచేశారు. భారత ప్రభుత్వ తామ్రపత్ర గుర్తింపుతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. హిందూ ముస్లిం ఐక్యతా అవార్డు, కర్నాటక ప్రెస్ ​అకాడమీ అవార్డు, తిలక్​ మోహరరీ అవార్డు, రాజీవ్​గాంధీ సద్భావన అవార్డు, సుభాష్​చంద్రబోస్​ అవార్డులు వచ్చాయి. ​నేషనల్​లిటరసీ మిషన్​కు గౌరవ చైర్మన్​గా వ్యవహరించారు.

చైతన్యం నింపిన ‘జై తెలంగాణ’ పత్రిక

‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు’ అన్నట్లు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రత్యక్ష పోరాటం ఒక్కటే సరిపోదని భావించిన వీహెచ్​దేశాయి..  ఓ పత్రిక స్థాపించాలనుకున్నారు. ‘ది జై తెలంగాణ’ పత్రికను నెలకొల్పారు. ఉర్దూ, ఇంగ్లిష్​ భాషల్లో వచ్చే ఈ వారపత్రికలు తెలంగాణ ప్రాంత ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పోలీసు ​కాల్పులు, చనిపోయిన తెలంగాణ బిడ్డల లెక్కలను తేదీ, ప్రాంతం, అధికారిక, అనధికారిక లెక్కలతో సహా ప్రచురించారు. అమరవీరుల ఫొటోలను ప్రచురించారు. తెలంగాణ ప్రజా సమితి చైర్మన్​గా మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన పిలుపు, సందేశాలను ప్రజలకు చేరవేయడంలో ఆనాడు జై తెలంగాణ కీలకంగా దోహదం చేసింది. కాసు బ్రహ్మానందారెడ్డి లాంటి ఆంధ్రా పాలకులు కేంద్రంలో కాంగ్రెస్​అధిష్టానం వద్ద చేసే లాబీయింగ్​లు, ఎత్తుగడలను తెలంగాణ ప్రాంత నేతలతోపాటు ప్రజలకు ఎప్పటికప్పుడు దేశాయి తన పత్రిక ద్వారా చేరవేసేవారు. ‘‘Telangana is our birth right and we shall have it”అని 1970 జనవరి 26నే దేశాయి జై తెలంగాణ పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. తెలంగాణలో తిరుగుబాటు ఎందుకు? తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? లాంటి ఆర్టికల్స్​సీరియల్స్​గా రాశారు. తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ అధిష్టానానికి తెలంగాణ పరిస్థితిని చెప్పేందుకు జై తెలంగాణ పత్రిక క్లిప్పింగ్స్​ఎంతో ఉపయోగపడ్డాయి. తెలంగాణ ప్రాంత అగ్ర నాయకులందరూ జై తెలంగాణలో ఉద్యమం గురించిన వ్యాసాలు రాశారు. తెలంగాణకు ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని గడ్డం వెంకటస్వామి, ఆంధ్రప్రదేశ్​అవతరణ వ్యతిరేక దినోత్సవం జరపడం గొప్ప విజయం అని మర్రి చెన్నారెడ్డి, తెలంగాణకు న్యాయం జరిగి తీరాల్సిందేనని కొండా లక్ష్మణ్​ బాపూజీ, ప్రత్యేక రాష్ట్రం కోరడం నేరమేమీ కాదని ఈవీ పద్మనాభన్​లాంటి వారు విస్తృతంగా వ్యాసాలు రాశారు. ఏ మదన్​ మోహన్, టీఎన్​ సదాలక్ష్మి, సంజీవయ్య లాంటి వారు జై తెలంగాణను వేదికగా చేసుకొని ప్రజలను చైతన్యం చేశారు. అదే సమయంలో జై ఆంధ్రా ఉద్యమం ఎందుకు పుట్టింది, కాకినాడ విద్యార్థుల నిరసనలను, వాటి వెనుక గల నేతల ఉద్దేశాలను జై తెలంగాణ ద్వారా దేశాయి ప్రజలకు వివరించగలిగారు. 

స్వరాష్ట్రంలో ఏదీ గుర్తింపు!

క్విట్​ ఇండియా ఉద్యమం మొదలు హైదరాబాద్​ స్వాతంత్ర్య పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు అన్నిట్లో పోరాటయోధుడిగా, జర్నలిస్టుగా కీలక పాత్ర పోషించిన వీహెచ్​దేశాయిని స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గుర్తించలేదు. తెలంగాణ ఏర్పడిన మొదట్లో ప్రభుత్వ పెద్దలు కొందరు.. జై తెలంగాణ పత్రిక హక్కుల కోసం ప్రయత్నించారే గానీ, ఉద్యమకారుడిగా దేశాయిని గుర్తించలేదని తెలుస్తున్నది. వివరాలు దొరికిన కొంత మంది తొలిదశ తెలంగాణ ఉద్యమకారులను సన్మానం చేసింది. కానీ వీహెచ్​దేశాయి లాంటి నిస్వార్థ వీరుల వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేయలేదు. ‘ఆ చల్లని సముద్ర గర్భం.. దాచిన బడబానలమెంతో,  ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’ అన్నట్లుగా తెలంగాణ కోసం కొట్లాడిన దేశాయి లాంటి ఎందరో వీరులు ఇలా చరిత్ర మరుగున పడిపోగా.. తెలంగాణలో తమకు నచ్చిన రీతిలో కొత్త చరిత్రను లిఖించుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి. 

తెలంగాణ చాంపియన్లకు పెద్దపీట

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల లీడర్లను జై తెలంగాణ పత్రిక ద్వారా దేశాయి సముచితంగా గుర్తింపునిచ్చారు.  కాసు బ్రహ్మానందారెడ్డి మంత్రివర్గం నుంచి తెలంగాణ కోసం మొట్టమొదలు రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్​బాపూజీ, తెలంగాణ కోసం నిలబడిన హైదరాబాద్​రెండో మేయర్​ ఎన్. లక్ష్మీనారాయణ, తెలంగాణ కోసం ఎంపీలుగా కొట్లాడిన జీఎస్​ మెల్కోటే, గడ్డం వెంకటస్వామి, ఎం. నారాయణ రెడ్డి, ఎన్. రామచంద్రారెడ్డి, వీబీ. రాజు, ఎన్జీవోస్​యూనియన్​ ప్రెసిడెంట్​జీఆర్​పిళ్లై, కార్మిక నాయకుడు వెంకటేశం, తెలంగాణ కేసరిగా గుర్తింపు పొందిన కేవీ రంగారెడ్డి, ఏపీ అసెంబ్లీలో మొట్టమొదటి సారి ‘జై తెలంగాణ’ అని నినదించిన ఎం మాణిక్​రావు, మొదటిసారి తిరుగుబాటు బ్యానర్ ఎగరేసిన  విద్యార్థి ఉద్యమనాయకుడు మల్లిఖార్జున్, ప్రజా ఉద్యమం నుంచి ఎన్నికల పరంగా విజయం సాధించిన ఎస్​వెంకటరామా రెడ్డి, శ్రీధర్​ రెడ్డి, అచ్యుత రెడ్డి, రాజమల్లు, హాయగ్రీవాచారి, టి. అంజయ్య, కుముద్​నాయక్, కె.రామచంద్రారెడ్డి, ఐరేణి లింగయ్య లాంటి ప్రముఖులను ఫొటోలతో సహా ‘చాంపియన్స్​ఆఫ్​తెలంగాణ’ పేరిట జైతెలంగాణలో ప్రచురించారు. సుదీర్ఘకాలం ఆయన పత్రిక నడిపారు. మొత్తం ఉద్యమ సమయంలో పీవీ నర్సింహారావుతో దేశాయికి ప్రత్యేక అనుబంధం ఉన్నది. పీవీ ప్రధాని అయిన తర్వాత ఇంటి స్థలంతోపాటు కొన్ని పదవులు ఇచ్చేందుకు ప్రయత్నించగా దేశాయి తీసుకోలేదు. ఆయన నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా జర్నలిస్టుగా ఉండేందుకు ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు. అయితే దేశాయికి తెలియకుండానే పీవీ నర్సింహారావు యూనియన్​బ్యాంక్​ఆఫ్​ఇండియా డైరెక్టర్​గా నామినేట్​చేశారు. చాలా రోజుల తర్వాత బ్యాంక్​ఆఫీసర్లు ఆయన ఇంటికి వస్తే గానీ ఆ విషయం దేశాయికి తెలియలేదు. ఆయన చివరి వరకు హైదరాబాద్ లోని నల్లకుంటలోనే ఓ చిన్న ఇంట్లో గడిపారు. 2003లో అనారోగ్యంతో హాస్పిటల్​లో చికిత్స పొందుతూ కాలం చేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా.. వారు హైదరాబాద్​లోనే నివాసం ఉంటున్నారు. దేశాయి కమిట్​మెంట్​గల జర్నలిస్ట్​అని ఎన్టీఆర్​ప్రశంసిస్తే,  నిజమైన స్వాతంత్ర్య యోధుడని మాజీ సీఎం టి. అంజయ్య కొనియాడారు. దేశాయి ఆదర్శవాది అని కొండా లక్ష్మణ్​బాపూజీ ప్రశంసించారు.