న్యూఢిల్లీ: రాజ్యసభలో అధికార పక్ష నేతగా బీజేపీ చీఫ్, కేంద్ర హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాశ్ నడ్డా నియమితులయ్యారు. గురువారం రాజ్యసభ 264వ సెషన్ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా హౌస్ లీడర్‌గా జేపీ నడ్డాను అపాయింట్ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర సభ్యులంతా బల్లలపై చరుస్తూ అభినందనలు తెలియజేశారు.
రాజ్యసభలో సభా నాయకుడిగా నడ్డాను అపాయింట్ చేయాలని బీజేపీ గతంలోనే నిర్ణయించింది. ఇదే విషయాన్ని రాజ్యసభకు గురువారం సభ చైర్మన్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. కాగా, పెద్దల సభలో ఇప్పటిదాకా పీయూష్ గోయల్ సభాపక్ష నేతగా ఉండగా..ఆయన స్థానంలో ఇప్పుడు నడ్డాను ఎంపిక చేశారు. నడ్డా ప్రస్తుతం మోదీ కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే.. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
