చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా..

 చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా..
  • జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారాం పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరం
  • మరోసారి పోటీకి సై అంటున్న సీనియర్​లీడర్ 

కామారెడ్డి, వెలుగు :  ఆయన తక్కువ కులం వాడని హోటల్​లో చాయ్​పోసేందుకు నిరాకరించారు. తన గోడు కలెక్టర్​కు చెప్పుకుందామని పోతే, పోలీసులు ఎత్తి బయటపడేశారు. అయితే ఈ ఘటనతో ఆయన కుంగిపోలేదు. ఎక్కడ తనను తక్కువ చేసి చూశారో, అక్కడే తల ఎత్తుకోవాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలతో ఏడాది తిరిగేలోగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరెవరో కాదు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదగర్​గంగారాం. ఈయనది నియోజకవర్గంలోని చిన్నకొడప్​గల్. ఊరిలో చెప్పులు కుట్టుకుంటూ జీవించేవారు. 1976లో తనకు 23 ఏండ్లు ఉన్నప్పుడు ఊరిలోని ఓ హోటల్​లో చాయ్​తాగేందుకు వెళ్లారు.

 

Also Raed : పోలవరం అఫిడవిట్​లో అన్నీ తప్పులే : సీడబ్ల్యూసీ, పీపీఏలకు తెలంగాణ లేఖ

అయితే సెపరేట్​గ్లాస్​లేదని, చాయ్​పొయ్యమని హోటల్ వాళ్లు చెప్పారు. దీంతో కలత చెందిన గంగారాం.. నాటి నిజామాబాద్​కలెక్టర్ ఆనంద్​కుమార్​ను కలిసి ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్​కు వెళ్లారు. కలెక్టర్​ను కలిసేందుకు చాంబర్​ముందు కూర్చోగా,  పోలీసులు వచ్చి గంగారాంను ఈడ్చుకెళ్లి ఆఫీసు బయటపడేశారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పినప్పటికీ, కలెక్టర్​ను కలిసే అవకాశం కల్పించలేదు. తాను అనామకుడు కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావించిన గంగారాం.. ఎలాగైనా లీడర్​కావాలని అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని.. అప్పుడు గెలిచినా, ఓడినా తాను పాపులర్​అవుతానని భావించారు. దీనికితోడు జుక్కల్​ఎస్సీ నియోజకవర్గం కావడం కూడా ఆయనకు కలిసొచ్చింది. 

లాయర్ గోపాల్ రావు సాయంతో.. 

కలెక్టరేట్ నుంచి ఇంటికొచ్చిన గంగారాం.. ఊరిలోని కులకర్ణి గోపాల్​రావు అనే వకీల్​ను కలిసి తన పరిస్థితి చెప్పుకున్నారు. గోపాల్​రావు, పీవీ నర్సింహారావు క్లాస్​మేట్స్. వీరిద్దరికీ మహారాష్ర్టకు చెందిన కాంగ్రెస్​నేత శంకర్​రావు చౌహాన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గంగారాం పట్టుదలను గమనించిన గోపాల్​రావు.. ఆయనను మహారాష్ట్ర తీసుకెళ్లి శంకర్​రావు చౌహాన్​ను కలిపించారు. ఢిల్లీ​స్థాయిలో పలుకుబడి ఉన్న చౌహాన్.. ఇందిరా కాంగ్రెస్​తరఫున గంగారాంకు జుక్కల్​టికెట్​ఇప్పించారు. అలా 1978లో జుక్కల్​అసెంబ్లీ బరిలోకి దిగిన గంగారాం.. ఆలిండియా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఈశ్వరీబాయిపై 9 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. చెప్పులు కుట్టుకునే ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తర్వాత 1983, 1989, 2004 ఎన్నికల్లోనూ గంగారం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  2018లో మాత్రం బీఆర్ఎస్​అభ్యర్థి హన్మంతుషిండే చేతిలో ఓడిపోయారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు గంగారాం సిద్ధమయ్యారు.