
- 10 రోజులుగా ఆగమాగం.. పీక్ అవర్స్‌లో కంట్రోల్ ఉంటలే
- పాయింట్ డ్యూటీలో కనిపించని పోలీసులు
- నియంత్రణ మొత్తం సిగ్నళ్లకే వదిలేసిన్రు.. పట్టించుకోని పెద్దాఫీసర్లు
- ఉదయం, సాయంత్రం జనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు
- రాత్రి 8 గంటలు దాటితే నడిరోడ్డుపై నరకమే
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ గాడి తప్పుతున్నది. కంట్రోల్ చేసే వారు లేక ఎక్కడికక్కడే జంక్షన్లు జామ్ అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో పరిస్థితి ఘోరంగా ఉంటున్నది. వాహనాలు ముందుకు కదలక నడిరోడ్డుపై జనం నరకం చూస్తున్నారు. గత 10 రోజులుగా ఇలానే ఉంటున్నది. వీఐపీలు వచ్చి వెళ్లే సమయాల్లో మాత్రమే కనిపించే ట్రాఫిక్ సీఐలు, ఎస్‌ఐలు.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో రోడ్లపై ఉండటం లేదు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్ బాధ్యతలను కానిస్టేబుల్స్, హోంగార్డులకే అప్పగించడంతో.. పీక్ అవర్స్‌లో ప్రధాన కూడళ్లు, రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోతున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రాఫిక్ జామ్స్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రయాణించే మార్గాల్లో కూడా ట్రాఫిక్‌ను ఆపొద్దని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుకాకపోవడం గమనార్హం.
ఫీల్డ్‌లో కానిస్టేబుల్స్, హోంగార్డులే
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2,500 మంది ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తున్నారు. 180 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇందులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన జంక్షన్లను డీసీపీ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తుంటారు. పీక్ అవర్స్‌లో ఏసీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు రోడ్లపైనే ఉండాలి. పాయింట్ డ్యూటీ సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలి. కానీ 10 రోజులుగా ఉన్నతాధికారులు ట్రాఫిక్ మానిటరింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రద్దీ సమయాల్లో కనీసం ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి అధికారులు కూడా ఉండటం లేదు. ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ మానిటరింగ్‌ను కానిస్టేబుల్స్, హోంగార్డులకే వదిలేశారు. పాయింట్ డ్యూటీలో కేవలం ఒక కానిస్టేబుల్, హోంగార్డును మాత్రమే నియమిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయిన సమయాల్లో కంట్రోల్ చేయడం సవాల్‌గా మారింది. ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే హాట్ స్పాట్స్‌లో కనీసం పట్టించుకోవడంలేని సిటిజన్లు మండిపడుతున్నారు. ప్రయాణ సమయం పెరిగిపోతున్నదని, ఎటు చూసినా వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడుతున్నదని వాపోతున్నారు. మరోవైపు ట్రాఫిక్ విభాగంలో కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుళ్లకు సిగ్నల్స్ వద్ద డ్యూటీ వేస్తున్నారు. దీంతో వారికి ట్రాఫిక్‌ను ఎలా డీల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
కోర్ సిటీలో కంట్రోల్ ఉంటలే
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. వీఐపీల రాకపోకలు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, బేగంపేట్, నాంపల్లి, మొజంజాహి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కామన్ అయిపోయింది. సికింద్రాబాద్‌లో ప్యారడైజ్ సర్కిల్, ప్యాట్నీ, సిటీలైట్సర్కిళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఫస్ట్ షిఫ్ట్‌లో ఉదయం 6 గంటలకే విధుల్లో ఉండాల్సిన సిబ్బంది.. డ్యూటీలో కనిపించడం లేదు. సెకండ్ షిఫ్ట్‌లో రాత్రి 10 గంటల వరకు డ్యూటీలో ఉండాల్సిన ఇన్‌స్పెక్టర్స్, ఎస్‌ఐలు 8 గంటల దాకా ఉండటం లేదు. రద్దీగా ఉండే జంక్షన్స్ వద్ద ముగ్గురు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. రాత్రి సమయాల్లో కొన్ని సిగ్నల్స్ వద్ద కనీసం కానిస్టేబుల్ కూడా కనిపించడం లేదు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని వాహనదారులు నరకం చూస్తున్నారు.
ఇదే కారణమా?
రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో భారీగా ట్రాన్స్‌ఫర్స్, పోస్టింగ్స్ జరిగాయి. చాలా మంది ఇన్‌స్పెక్టర్స్, ఎస్‌ఐలు ఇతర చోట్లకు వెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి ట్రాన్స్‌ఫర్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది ట్రాఫిక్ అధికారులు మళ్లీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయనే భావనలో ఉన్నట్లు తెలిసింది. సిగ్నల్స్‌ను కానిస్టేబుల్స్, హోంగార్డులకు వదిలేసి వారంతా పీఎస్‌కే పరిమితం అయ్యారని డిపార్ట్‌మెంట్‌లో డిస్కషన్ జరుగుతున్నది.