ప్రతినెలా 15లోపు జూడాలకు స్టైపెండ్

ప్రతినెలా 15లోపు  జూడాలకు స్టైపెండ్
  • ప్రతినెలా 15లోపు  జూడాలకు స్టైపెండ్
  • కొత్త సాఫ్ట్​వేర్​ అమలుకు హెల్త్​ మినిస్టర్​ నిర్ణయం
  • మంత్రితో చర్చల తర్వాత సమ్మె విరమించిన జూనియర్​ డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ కు కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. నూతన విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధా నానికి బదులుగా కొత్త సాప్ట్ వేర్ సిస్టమ్​ను తీసుకురానున్నారు. 20 రోజుల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. దీంతో జూడాల అటెండెన్స్, పనితీరు స్పష్టంగా, సులువుగా తెలుస్తుందని అధికారులు చెప్తు న్నారు. దీంతో ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైపెండ్​ను జమ చేసే అవకాశం ఉంటుందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. 

అయితే, జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ ఆలస్యంపై మంత్రి ఫైర్ అయ్యారు. న్యాయపరమైన డిమాండ్ ను పరిష్కరించడంలో ఇంత కాలం జాప్యం చేయడంపై ప్రశ్నించారు. బడ్జెట్ అంశంలో తాను చొరవ చూపుతానని, ప్రతి నెలా జూడాలకు స్టైపెండ్ పడేలా చర్యలు తీసుకోవాల్సిందేనని డీఎంఈని ఆదేశించారు. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 

జూడాలకు కొత్త హాస్టళ్లు

ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న​ అన్ని ఆస్పత్రుల్లోనూ జూడాలకు కొత్త హాస్టళ్లు కట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పది కొత్త హాస్టళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ఆస్పత్రుల్లోనూ జూనియర్ డాక్టర్లకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో పర్యటిస్తానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని జూడాలకు తెలిపారు. 

రెండు నెలల్లో ఉస్మానియా కొత్త బిల్డింగ్​పై నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పాతది కూల్చి కొత్తది కట్టాలా.. అనేది నిపుణుల బృందంతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. పేదలను కాపాడుతున్న డాక్టర్ల సంక్షేమానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తూనే ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.