
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరస్వతినది పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. మంత్రి సీతక్క ఈ రోజు ( మే 25) పుణ్యస్నానాలు ఆచరించారు. ఎంపీ వంశీకృష్ణ కార్యకర్తలతో కలిసి త్రివేణి సంగమంలో పుష్కరస్నానం చేసి సరస్వతి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వంశీకృష్ణ.. మంత్రి సీతక్క స్వామి వారి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాళేశ్వరం పుష్కరాలు తనకు చాలా నేర్పించాయన్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ .. ప్రస్తుత సమాజంలో కులాన్ని బట్టి విలువ ఇవ్వడం బాధకరమన్నారు. కులం కంటే డబ్బు చాలా గొప్పది అని ఈ పుష్కరాల వల్ల తెలుసుకున్నానన్నారు. తనకు అండగా ఉన్న అన్ని కులసంఘాలకు కృతఙ్ఞతలు తెలిపారు ఎంపీ వంశీకృష్ణ. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14 అందరికీ సమానత్వం కల్పించిందంటూ అక్కడ ఉన్న అధికారులను ప్రశ్నించారు.
మంత్రి సీతక్క ఏమన్నారంటే..
తాను సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పుష్కరాల సందర్భంగా ఎంపీ వంశీకృష్ణతో చర్చించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన మంత్రి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. సోమవారంతో( మే 26) తో పుష్కర స్నానాలు ముగుస్తాయని.. భక్తులందరూ పుష్కర స్నానం చేసి పునీతులు కావాలని మంత్రి సీతక్క కోరారు.