వనపర్తి, వెలుగు : పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రిజర్వాయర్లు కట్టకపోవడంతోనే ప్రస్తుతం రైతులకు సాగునీరు అందని దుస్థితి నెలకొందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం వనపర్తి కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అధికారుల సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు గత పదేండ్లుగా రిజర్వాయర్లపై ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. మెదక్ తదితర జిల్లాల్లో మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులు కట్టిన బీఆర్ఎస్ పాలమూరులో మాత్రం ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానకాలం పంటల సాగుకు, తాగునీటికి 18.19 టీఎంసీల నీరు అవసరమని, అయితే ఎల్ నినో ప్రభావంతో ప్రాజెక్టులలో నీటి లభ్యత తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న 7 టీఎంసీలతో పాటు కర్ణాటక ప్రభుత్వం నుంచి విడుదల చేస్తున్న జలాలను జాగ్రత్తగా వాడుకుంటే తాగు, సాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చని వెల్లడించారు. రైతుల పంటలను కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించామని, ఇరిగేషన్ అధికారులు నవంబర్ 27 వరకు వారబంది పద్ధతిలో నీటిని అందించాలని ఆదేశించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ త్వరలోనే తుంగభద్ర జలాలను కూడా ఆర్డీఎస్‌కు వదిలేలా కృషి చేస్తామన్నారు. అనంతరం వనపర్తి, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు మాట్లాడారు. సమావేశంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఏడీసీలు ఖీమ్య నాయక్, వినోద్‌కుమార్, వనపర్తి, గద్వాల ఎస్పీలు సునీతారెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ సీఈ ర్ రహీముద్దీన్, ఎస్ ఈ చంద్రశేఖర్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
