పాక్‌లో పరిస్థితి దారుణం..కరోనా ట్రీట్‌మెంట్‌కు రెండే వెంటిలేటర్లు

పాక్‌లో పరిస్థితి దారుణం..కరోనా ట్రీట్‌మెంట్‌కు రెండే వెంటిలేటర్లు

న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌పై కరోనా ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. ఆ దేశంలో వైరస్ ఇన్ఫెక్షన్స్ రేటు ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాల లేమి, ఆహార కొరతతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. చైనా అధీనంలోని గ్జిన్ జియాంగ్ ప్రావిన్స్‌కు సరిహద్దు ప్రాంతమైన పాక్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్‌లో 800 కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ఇక్కడ సరైన మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేవని కొందరు చెబుతున్నారు. కేవలం రెండు పాత మోడల్ వెంటిలేటర్స్‌ మాత్రమే ఉన్నాయిని మానవ హక్కుల కార్యకర్త, డాక్టర్ అంజాద్ అయూబ్ మీర్జా ఓ ట్వీట్ ద్వారా చెప్పారు. పాక్ ప్రభుత్వం నుంచి ఈ రీజియన్‌కు ఎలాంటి మెడికల్ ఎయిడ్ సప్లయి అందలేదని అక్కడి యాక్టివిస్ట్‌లు, లాయర్స్, ప్రజలు వాపోతున్నారు.

‘ప్రభుత్వానికి ఫండ్స్, డొనేషన్స్ అందుతాయి. కానీ వాళ్లు ఆ విరాళాలను వారి స్వప్రయోజనాలకు వాడుకుంటారు. ప్రజల బాగు కోసం ఖర్చు చేయరు. ఏదేమైనా, వారు అధికారంలోకి రావడానికి ప్రజలే కారణమని గ్రహించాలి. హక్కుల కోల్పోయిన ఈ ప్రాంతంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నా. కరోనా రక్కసి కారణంగా ఇక్కడ నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది’ అని మహ్మద్ బాకర్ మెహ్దీ అనే లాయర్ లోకల్ మీడియాకు తెలిపారు.