రాష్ట్ర హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ?

రాష్ట్ర హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ?
  •    కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫార్సు!
  •     పలు హైకోర్టుల చీఫ్​ జస్టిస్​ల బదిలీకి నిర్ణయం

న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ హిమా కోహ్లిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి చీఫ్​ జస్టిస్​గా రాధాకృష్ణన్​ నియమితులయ్యారు. ఆయన వెస్ట్​బెంగాల్​ హైకోర్టుకు బదిలీకావడంతో గత ఏడాది జూన్​లో జస్టిస్​ ఆర్ఎస్​ చౌహాన్​ సీజేగా వచ్చారు. తాజాగా మరోసారి బదిలీలతో కొత్త సీజే రానున్నారు. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్​ జస్టిస్​లను బదిలీ చేయాలని సోమవారం జరిగిన మీటింగ్​లో కొలీజియం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర హైకోర్టు సీజే ఆర్ఎస్​ చౌహాన్​ను ఉత్తరాఖండ్​ హైకోర్టుకు.. ఏపీ హైకోర్టు చీఫ్​ జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు.. సిక్కిం హైకోర్టు చీఫ్​ జస్టిస్ అరూప్  గోస్వామిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రికమెండ్​ చేసినట్టు తెలిసింది. ఇక ఒడిశా హైకోర్టు సీజేగా ఎస్.మురళీధర్  ను నియమించాలని సూచించినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో టాప్​ మోస్ట్​ సీనియర్లు అయిన ఐదుగురు జడ్జీల కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ఈ సిఫార్సులు చేసింది. కేంద్ర న్యాయ శాఖ ఈ ప్రతిపాదనలను పరిశీలించి రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి సంతకం తర్వాత బదిలీలపై నోటిఫికేషన్​ విడుదలవుతుంది. ఇందుకు ఒకట్రెండు వారాలు టైం పడుతుందని అంచనా వేస్తున్నారు.