సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ..రాష్ట్రపతి ఉత్తర్వులు

సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ..రాష్ట్రపతి ఉత్తర్వులు

సుప్రీం తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సీజేఐ బోబ్డే ప్రతిపాదనకు రాష్ట్రపతి అంగీకారం తెలిపారు. ఈ  నెల 23న జస్టిస్ S.A బోబ్డే పదవీ విరమణ చేయనుండగా..24న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. 2022 ఆగష్టు 26 వరకు పదవిలో కొనసాగుతారు.  1957 ఆగస్ట్ 27న కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టారు జస్టిస్ ఎన్వీ రమణ. 1983లో అడ్వొకేట్ గా ఎన్ రోల్ అయ్యారు. నాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్, క్రిమినల్, కానిస్టిట్యూషనల్, లేబర్, ఎలక్షన్ మ్యాటర్ లకు సంబంధించిన కేసులు వాదించారు. 2000 సంవత్సరం జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పర్మినెంట్ జడ్జ్ గా అపాయింట్ అయ్యారు. 2013 మార్చ్ 10 నుంచి మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వెళ్లారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు.

సుప్రీం కోర్టు జడ్జిగా అనేక కీలక కేసుల విచారణలో పాల్గొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇంట్లో మహిళలు చేసే పని.. ఆఫీస్ లో భర్త చేసే పనికన్నా తక్కువేమీ కాదని తీర్పునిచ్చింది ఆయనే. తర్వాత MD అన్వర్ వర్సెస్ NCT ఢిల్లీ, అనురాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూకశ్మీర్ లాంటి కీలక కేసుల తీర్పుల్లో ఆయన జడ్జిగా ఉన్నారు. జమ్మూకశ్మీర్ లో 4G సర్వీసులను తక్షణమే పునరుద్ధరించాలని తీర్పునిచ్చిన ముగ్గురు జడ్జిల బెంచ్ కు జస్టిస్ రమణ హెడ్ గా ఉన్నారు.