సీజేఐగా రేపు (నవంబర్ 23) జస్టిస్ సూర్యకాంత్ప్రమాణం

సీజేఐగా రేపు (నవంబర్ 23) జస్టిస్ సూర్యకాంత్ప్రమాణం

న్యూఢిల్లీ: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‎లో జరిగే ఈ వేడుకకు ఏడు దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. జస్టిస్ సూర్యకాంత్‎తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తాజా మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. జస్టిస్ సూర్యకాంత్ కుటుంబానికి ఇప్పటికే ఆహ్వానం పలికినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

కాగా, జస్టిస్ సూర్యకాంత్ తన సుదీర్ఘ వృత్తి జీవితంలో దాదాపు వెయ్యికి పైగా కీలక తీర్పులు వెలువరించారు. పలు రాష్ట్రాల హైకోర్టుల్లో జడ్జిగా వ్యవహరించారు. కీలక బెంచ్‎లలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. జమ్మూకాశ్మీర్‎లో ఆర్టికల్ 370 రద్దు, డేరా సచ్ఛా సౌధా కేసు, దేశద్రోహ చట్టంపై స్టే, పెగాసస్ స్పైవేర్ కేసు.. తదితర కీలక కేసుల విచారణలో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 న పదవీ విరమణ చేస్తారు.