వరల్డ్‌‌‌‌ ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సురేఖ టీమ్​కు గోల్డ్‌‌‌‌

వరల్డ్‌‌‌‌ ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సురేఖ టీమ్​కు గోల్డ్‌‌‌‌

బెర్లిన్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ ఆర్చరీ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలుగు ఆర్చర్‌‌‌‌ వెన్నం జ్యోతి సురేఖ బృందం కొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఫైనల్లో జ్యోతి సురేఖ–అదితి స్వామి–పర్నీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ 235–229తో డాఫ్నె క్వింటెరో–అనా సోఫియా హెర్నాండేజ్‌‌‌‌ జియోన్‌‌‌‌–అండ్రియా బెసెరాతో కూడిన మెక్సికో టీమ్‌‌‌‌పై సంచలన విజయం సాధించింది. దీంతో 42 ఏళ్ల ఇండియన్‌‌‌‌ ఆర్చరీ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ‘వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌’ను తొలిసారి సొంతం చేసుకుంది. 1981లో తొలిసారి ఇటలీలో జరిగిన వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బరిలోకి దిగిన ఇండియన్‌‌‌‌ ఆర్చర్లు రికర్వ్‌‌‌‌లో నాలుగుసార్లు, కాంపౌండ్‌‌‌‌లో ఐదుసార్లు ఫైనల్​ చేరినా సిల్వర్​తోనే తిరిగొచ్చారు. తొలిసారి సురేఖ నేతృత్వంలోని జట్టు హిస్టారికల్ గోల్డ్ కైవసం చేసుకుంది. 

 ముందుండి నడిపించి

మెక్సికోతో గోల్డ్​ మ్యాచ్​లో ఆరంభం నుంచే జ్యోతి–అదితి–పర్నీత్‌‌‌‌ అద్భుతమైన గురితో ఆకట్టుకున్నారు. ఏ దశలోనూ మెక్సికో ఆర్చర్లకు చాన్స్‌‌‌‌ ఇవ్వకుండా ప్రతి రౌండ్‌‌‌‌లోనూ ఆధిక్యంలో నిలిచారు. స్టార్​ ఆర్చర్​ సురేఖ టీమ్​ను ముందుండి నడిపించింది.  తొలి రౌండ్‌‌‌‌లో ఒకే ఒక్కసారి 10 పాయింట్ల మార్క్‌‌‌‌ను మిస్సయిన జ్యోతి బృందం 59–57 ఆధిక్యంలో నిలిచింది.  రెండో రౌండ్‌‌‌‌లోనూ అదే జోరును చూపెట్టడంతో ఇండియా ఆధిక్యం 118–115కు పెరిగింది. మూడో రౌండ్‌‌‌‌లో మెక్సికన్లు చేతులెత్తేశారు. దాంతో ఓవరాల్‌‌‌‌గా ఐదు పాయింట్ల ఆధిక్యంతో ఆఖరి రౌండ్‌‌‌‌ను మొదలుపెట్టిన ఇండియన్లకు గోల్డ్‌‌‌‌ నెగ్గాలంటే ఐదు పాయింట్లు అవసరమయ్యాయి. ఈ దశలో జ్యోతి గురి తప్పకుండా బాణాలు వేసి ఏకంగా 9 పాయింట్లు నెగ్గడంతో చిరస్మరణీయ విజయం సొంతమైంది. ఈ రౌండ్‌‌‌‌లో మెక్సికో 57 పాయింట్లకే పరిమితమైతే ఇండియా 58 పాయింట్లు నెగ్గింది. ఓవరాల్​గా ఇప్పటి వరకు 12 వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో బరిలోకి దిగిన  ఇండియా ఖాతాలో 1 గోల్డ్‌‌‌‌, 9 సిల్వర్‌‌‌‌, 2 బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ ఉన్నాయి. 

మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు నిరాశ..

అభిషేక్‌‌‌‌ వర్మ–ఒజాస్‌‌‌‌ దియోతలే–ప్రథమేశ్‌‌‌‌తో కూడిన మెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌ టీమ్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో 230–235 తేడాతో నెదర్లాండ్స్‌‌‌‌ చేతిలో ఓడింది. రికర్వ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో ఇండియా 1–5తో సౌత్‌‌‌‌ కొరియా చేతిలో కంగుతిన్నది. విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ 2–6తో డచ్‌‌‌‌లో చేతిలో చిత్తయింది. 

మరో గోల్డ్​ వేటలో సురేఖ

శనివారం జరిగే విమెన్స్‌‌‌‌ ఇండివిడ్యువల్ కాంపౌండ్‌‌‌‌లోనూ జ్యోతి సురేఖ మెడల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగనుంది. క్వార్టర్‌‌‌‌ఫైనల్లో జ్యోతి.. కౌర్‌‌‌‌తో, అదితి.. సునె డి లాట్‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌)తో తలపడతారు. మెన్స్‌‌‌‌లో ఒజాస్‌‌‌‌.. ప్రెజ్‌‌‌‌మెస్లావ్‌‌‌‌ కొనెకి (పోలెండ్‌‌‌‌)ను ఎదుర్కొంటాడు. 

ఏడో మెడల్​ గోల్డ్‌‌‌‌

విమెన్స్‌ కాంపౌండ్‌లో ఇండియా టాప్​ ఆర్చర్​గా ఉన్న జ్యోతి సురేఖ 2013–2023 మధ్యకాలంలో ఆరు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో పాల్గొని ఆరు మెడల్స్‌‌‌‌ సాధించింది. ఇందులో 4 సిల్వర్‌‌‌‌, 2 బ్రాంజ్‌‌‌‌ మెడల్స్​ ఉన్నాయి. అయితే,  చాన్నాళ్ల నుంచి ఆమెను గోల్డ్​ ఊరించింది. తాజా టోర్నీలో  గోల్డ్‌‌‌‌ నెగ్గిన సురేఖ ఎట్టకేలకు  తన కల నెరవేర్చుకుంది.  దీంతో పాటు ఈ ఈవెంట్‌‌‌‌లో మెడల్స్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ను కూడా పూర్తి చేసింది. ‘మన ఖాతాలో సిల్వర్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ చాలా ఉన్నాయి. అందుకే కచ్చితంగా గోల్డ్‌‌‌‌ గెలవాలని నిర్ణయించుకున్నాం. దాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మున్ముందు మరిన్ని బంగారు పతకాలు సాధిస్తాం ’ అని జ్యోతి సురేఖ తెలిపింది.