ఎప్పుడూ కబడ్డీ ఆడుతారు.. ఆడి వీళ్లేం సాధిస్తారు?

ఎప్పుడూ కబడ్డీ ఆడుతారు.. ఆడి వీళ్లేం సాధిస్తారు?

ఏ గేమ్​లోనైనా ఛాంపియన్​ అవ్వాలంటే బెస్ట్​ కోచ్​ ఉండాలి. కానీ, వీళ్లు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండానే  కబడ్డీలో అదరగొడుతున్నారు. పేద కుటుంబాలకి చెందిన వీళ్లకి  కబడ్డీ ఆటంటే చాలా ఇష్టం. టీవీల్లో కబడ్డీ చూసి, ఏకలవ్య శిష్యుల్లా ప్రాక్టీస్ చేసేవాళ్లు. ఆటలో స్కిల్స్​ పెంచుకొని మండలం, జిల్లా స్థాయిలో కబడ్డీ టోర్నమెంట్లలో అదరగొట్టారు. ఈమధ్యే నేషనల్ రూరల్ కబడ్డీ పోటీల్లో సత్తాచాటి, ఛాంపియన్​గా నిలిచారు కూడా. అంతేకాదు ఇంటర్నేషనల్ పోటీల్లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నారు మెదక్ జిల్లాకి చెందిన మట్టిలో మాణిక్యాలు. వీళ్ల సక్సెస్ జర్నీ ఇది...

స్టేట్ లెవల్​ కబడ్డీ పోటీల్లో గెలవాలంటే టెక్నిక్స్​ తెలియాలి. అయితే, డబ్బులు పెట్టి కోచింగ్​ తీసుకునే స్థోమత లేదు వీళ్లకు. కోచ్​ లేకపోతేనేం ఏకలవ్య శిష్యుల లెక్క టీవీలో  ప్రొ– కబడ్డీ మ్యాచ్​లు చూసి ఆటలో మెళకువలు నేర్చుకున్నారు. అల్లకుంట ప్రవీణ్, బండారి వంశీ గౌడ్,  కార్తీక్ రెడ్డి, సంగెపు గణేష్, కరుణాకర్, చందు, రాకేష్​ (వీళ్లది నిజాంపేట్​ మండలంలోని చల్మెడ), గుగులోత్ అజయ్(రామాయంపేట మండలం పర్వతాపూర్ తండా), దండు రాజేందర్ (దామర చెర్వు), మేకల రాకేష్​ (జాప్తి శివనూర్).... వీళ్లందరూ పేదింటి బిడ్డలే.  మండలం​, జిల్లాస్థాయి​ కబడ్డీ పోటీలకి రెగ్యులర్​గా వెళ్లేవాళ్లు. అక్కడే వీళ్లకి పరిచయం ఏర్పడింది. అందరి లక్ష్యం స్టేట్​ లెవల్​ పోటీల్లో పార్టిసిపేట్​ చేయడం. దాంతో వీళ్లంతా కలిసి ఒక టీంగా ఏర్పడ్డారు. అప్పటి నుంచి ఒకేచోట కబడ్డీ ప్రాక్టీస్​ చేసేవాళ్లు. 

టర్నింగ్ పాయింట్
వీళ్ల ఆట గురించి రూరల్​ గేమ్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా (ఆర్​జీఎఫ్​ఐ) ఉమ్మడి మెదక్​ జిల్లా కోచ్​ మల్లేశంకి తెలిసింది.  పోయిన నవంబర్​లో సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో స్టేట్​ లెవల్​ కబడ్డీ మీట్​ ఉందని వీళ్లకు చెప్పాడు. ఆ టోర్నమెంట్​ వీళ్ల జీవితంలో టర్నింగ్​పాయింట్​. ఆ పోటీల్లో బెస్ట్​ పెర్ఫార్మెన్స్​ ఇచ్చి, సెలక్టర్లని ఇంప్రెస్​ చేశారు. దాంతో వీళ్ల టీమ్​నే మన రాష్ట్రం నుంచి మహారాష్ట్రలో జరగనున్న నేషనల్ రూరల్ కబడ్డీ టోర్నమెంట్​కు ఎంపికచేశారు. వీళ్లు ఎన్నో రోజులుగా కలలుగన్న అవకాశం రానే వచ్చింది. కానీ, మహారాష్ట్ర వెళ్లేందుకు వీళ్ల దగ్గర డబ్బులు లేకపోవడంతో,  కొందరు దాతలు ఆర్థిక సాయం చేశారు. 

నేషనల్​ రూరల్​ ఛాంపియన్​షిప్
ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో నేషనల్ లెవల్​ టోర్నమెంట్ జరిగింది. ఫైనల్లో మహారాష్ట్ర బి–టీంని 6 పాయింట్స్​ తేడాతో ఓడించి,  నేషనల్​ రూరల్​ కబడ్డీ చాంపియన్​షిప్​ గెలుచుకుంది మెదక్ టీం. అంతేకాదు​ టీం మెంబర్స్​ అందరూ ఈ నెల 17, 18 తేదీల్లో నేపాల్​లో జరగనున్న ఇంటర్నేషనల్​ కబడ్డీ టోర్నమెంట్​కు సెలెక్ట్​ అయ్యారు కూడా.


రోజూ 4  గంటల ప్రాక్టీస్
వీళ్లంతా చదువుకుంటూనే రోజూ కబడ్డీ ప్రాక్టీస్​ చేసేవాళ్లు.  స్టేట్​ లెవల్​ కబడ్డీ టోర్నమెంట్​కోసం పొద్దున, సాయంత్రం రెండు గంటల చొప్పున రోజూ నాలుగ్గంటలు ప్రాక్టీస్​ చేశారు. హాలిడేస్​లో రోజంతా కబడ్డీ ఆడేవాళ్లు. ‘వీళ్లకు చదువు మీద ఇంట్రెస్ట్​ లేనట్టుంది. ఎప్పుడూ కబడ్డీ ఆడుతూనే ఉంటారు. కబడ్డీ ఆడి వీళ్లేం సాధిస్తారు?’ అని తల్లిదండ్రులు, గ్రామస్తులు అనే వాళ్లు. ఎవరెన్ని మాటలు అన్నా అవేమీ పట్టించు కోకుండా ప్రాక్టీస్​ మీదే దృష్టి పెట్టారు. అలా వాళ్ల కష్టానికి నేషనల్​ ఛాంపియన్​షిప్​తో గుర్తింపు వచ్చింది. 

ప్రొ–కబడ్డీ లీగ్​లో ఆడాలని ఉంది
చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే ఇంట్రెస్ట్. కబడ్డీలో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్​, తమిళనాడుకు చెందిన తిప్పన్న  దగ్గర గేమ్ టెక్నిక్స్ నేర్చుకున్నా. నా కెప్టెన్సీలో నేషనల్​ ఛాంపియన్​షిప్​ గెలవడం గర్వంగా ఉంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నా. ప్రొ–కబడ్డీ లీగ్​లో ఆడాలనేది నా డ్రీమ్. 
- మేకల రాకేష్ (కెప్టెన్), జాప్తి శివనూర్

పవన్ కుమార్​  ఇన్​స్పిరేషన్​ 
మాది వ్యవసాయ కుటుంబం. టెన్త్​ క్లాస్ తర్వాత కబడ్డీ ఆటమీద ఇష్టం పెరిగింది. ఆ ఇష్టం హాబీగా మారింది. కబడ్డీలో  పవన్​ కుమార్​ శరావత్ ఇన్​స్పిరేషన్. ఇండియన్ ఆర్మీలో చేరాలని అనుకుంటున్నా.
- దండు రాజేందర్, దామరచెర్వు 

టీం స్పిరిట్​తో 
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న కల్లుగీత కార్మికుడు. అమ్మ బీడీలు చుడుతుంది. ఒకేసారి రెండు మెడల్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. టీం స్పిరిట్​తో ఆడటం వల్లనే నేషనల్​ లెవల్​లో ఛాంపియన్లుగా నిలిచాం. 
- బండారి వంశీ గౌడ్, చల్మెడ


::: తిమ్మన్నగారి శ్రీధర్​, మెదక్​, వెలుగు