నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు: పోలీస్ కస్టడీ తీర్పు సోమవారానికి వాయిదా

నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు: పోలీస్ కస్టడీ తీర్పు సోమవారానికి వాయిదా

ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఏడు రోజుల కస్టడీ కోరుతూ సైబారాబాద్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. 

కాగా, డ్రగ్స్ కేసులో అరెస్టైన కేపీ చౌదరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. కేపీని కస్టడీకి ఇస్తే డ్రగ్స్ లింక్స్ ఉన్న సినీ తారలెవరో తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయనను  ఎన్ని రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తుందన్నది సోమవారం తేలనుంది. ఏదేమైనా కేపీ చౌదరి అరెస్టుతో సినీ తారల్లో భయం పట్టుకుందన్నది వాస్తవం.

గతంలో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసులో పలువురు హీరోలు, దర్శకులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కేపీ అరెస్ట్‌తో మరోసారి ఆ పేర్లన్నీ తెరపైకి వస్తున్నాయి. అయితే కస్టడీలో అతనిచ్చే సమాచ్చారం ఆధారంగా సినీ తారల డ్రగ్స్ బాగోతాలు బట్టబయలు కానున్నాయి. ఆయన ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారు?. డ్రగ్స్ విషయంలో ఆయనతో ఎవరెవరు టచ్ లో ఉంటున్నారు? అన్నవి బయటకు రానున్నాయి.

ఇప్పటికే చౌదరికి చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతని కాల్, వాట్సాప్ చాట్స్, ఇన్ స్టా అకౌంట్లపై దృష్టి పెట్టారు. అందులో ఉన్న సమాచారాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు..ఈ డ్రగ్స్ కేసులో ఏ-1గా ఉన్న రాకేష్ రోషన్‌కు సైతం స్టార్స్‌తో సంబంధాలు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో జరిగిన పలు పార్టీలకు రాకేష్, కేపీ ఇద్దరూ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.