కాబూల్ ఎయిర్‌‌పోర్టు మళ్లీ ఓపెన్‌

కాబూల్ ఎయిర్‌‌పోర్టు మళ్లీ ఓపెన్‌

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని హమీద్ ఖర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌ పోర్టు మళ్లీ తెరుచుకోబోతోంది. మొదటగా అఫ్గాన్‌కు అవసరమైన సాయం అందించేందుకు వచ్చే విమానాలను మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రయాణికుల విమానాల ఆపరేషన్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఈ మేరకు కాబూల్ ఎయిర్‌‌పోర్టును ఆపరేట్ చేసేందుకు ఒక టెక్నికల్ టీమ్‌ను పంపుతున్నామని ఖతార్ రాయబారి అఫ్గాన్‌కు సమాచారం ఇచ్చినట్లు అల్‌ జజీరా వార్తా సంస్థ శనివారం నాడు వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కాబూల్ ఎయిర్‌‌పోర్టులో రన్‌ వేలను రిపేర్ చేసినట్లు ఆ వార్త సంస్థ పేర్కొంది. 
 
అఫ్గాన్‌ను తాలిబన్లు తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలోని అన్ని ఎయిర్‌‌పోర్టులు బంద్ అయ్యాయి. ఒక్క కాబూల్ ఎయిర్‌‌పోర్టు మాత్రమే అమెరికా బలగాల కంట్రోల్‌లో ఆపరేట్ అయింది. ఈ విమానాశ్రయం నుంచే ఆ దేశంలో చిక్కుకున్న  విదేశీయులను తరలించడం సాధ్యమైంది. అయితే ఆగస్టు 30న అమెరికా బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోవడంతో కాబూల్ ఎయిర్‌‌పోర్టు కూడా మూతపడింది. దీంతో ఆ దేశంలో ఇంకా ఉండిపోయిన విదేశీ పౌరులు, తాలిబాన్లకు భయపడి విదేశాలకు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్లు అక్కడే చిక్కుకుపోయారు. అయితే వాళ్ల తరలింపు యథావిధిగా కొనసాగేలా చూడాలని తాలిబాన్లను ఇప్పటికే అమెరికా, యూకే, భారత్ సహా పలు దేశాలు కోరాయి. ఈ నేపథ్యంలో కాబూల్ ఎయిర్‌‌పోర్టును మళ్లీ ఆపరేట్ చేసేందుకు వీలుగా ఖతార్ సాయాన్ని తాలిబాన్లు కోరుతున్నట్టు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా ఖతార్ అంబాసిడర్ ప్రకటన చేయడం అక్కడ చిక్కుకున్న వారికి ఒక రకంగా శుభవార్త లాంటిదే.