ఇవాళ విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ 

ఇవాళ విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఇవాళ (మంగళవారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అవినాష్‌రెడ్డికి నోటీసులివ్వడం ఇదే మొదటిసారి. అయితే.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరవుతారా..? లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే.. అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. 

నిన్న అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏ రాఘవరెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గురించి సీబీఐ అధికారులు ఆరా తీశారని తెలుస్తోంది. మరోవైపు.. వివేకా హత్య కేసులో దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు.