కడెం ప్రాజెక్టు ఖాళీ!.. 20 రోజులుగా 15వ గేటు ఖుల్లా

కడెం ప్రాజెక్టు ఖాళీ!..  20 రోజులుగా 15వ గేటు ఖుల్లా
  • కడెం ప్రాజెక్టు ఖాళీ!
  • 20 రోజులుగా 15వ గేటు ఖుల్లా
  • రోజూ 1,500 క్యూసెక్కుల నీరు వృథా
  • మరో 15 రోజుల్లో రిజర్వాయర్ 
  • పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం
  • 65 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం
  • ఫండ్స్​ లేక  రిపేర్లు బంద్​

నిర్మల్, వెలుగు :  నిర్మల్​ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఖాళీ అవుతున్నది. ప్రాజెక్టు 15వ నంబర్ గేటు కౌంటర్ వెయిట్ విరిగి రెండు వారాలవుతున్నా దానికి రిపేర్లు చేయడం లేదు. దీంతో ప్రతిరోజూ దాదాపు 1,500 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్​ నుంచి వృథాగా పోతున్నది.  పరిస్థితి ఇలాగే ఉంటే మరో15రోజుల్లో రిజర్వాయర్​ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదముంది.  ప్రభుత్వం నుంచి ఫండ్స్​ రాక ప్రాజెక్టు రిపేర్లు, మోడ్రనైజేషన్​ పనులు పెండింగ్​ పడడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఇంజినీర్లు చెప్తున్నారు. దీంతో రిజర్వాయర్​పై ఆధారపడ్డ 65 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు  ఆందోళనకు గురవుతున్నారు. 

కొత్త గేట్లు పెట్టాలన్న ఎక్స్​పర్ట్స్​ కమిటీ.. 

గత ఏడాది జులై 12న ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కులు, ఈ ఏడాది జులై 27న 3.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో కడెం స్పిల్​వే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రాజెక్టును రక్షించాలంటే ఇప్పటికే ఉన్న పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు మరో 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా అదనపు స్పిల్​వే నిర్మించాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎక్స్ పర్ట్స్ కమిటీ  సూచించింది. ప్రాజెక్టులోకి కేవలం గంట వ్యవధిలోనే 3 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 18 గేట్లు ఓపెన్​ చేయడానికి కనీసం రెండు గంటల  టైం పడుతోందని, అందువల్లే కడెం డేంజర్​ జోన్​లో ఉందని స్పష్టం చేసింది. గేట్లు 65 ఏండ్ల క్రితం ఏర్పాటుచేసినవి కావడంతో వాటిని ఓపెన్​ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని మార్చాలని నిపుణులు స్పష్టం చేశారు. 

ALSO READ  :- అక్టోబర్ 9న భూపాలపల్లి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. హాజరుకానున్న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరద ప్రభావాన్ని 12 గంటల ముందే అంచనా వేయడానికి డెసిషన్ ​సపోర్ట్​ సిస్టంతో పాటు, ప్రాజెక్టుకు ఎగువన  రివర్ ​గేజ్​లు ఏర్పాటు చేయాలని రిపోర్ట్​ ఇచ్చారు. ప్రాజెక్టు ఎగువన కుప్టి వద్ద మరో రిజర్వాయర్​ను నిర్మిస్తే కడెంపై ఒత్తిడి తగ్గుతుందని ప్రతిపాదించారు. ఏడాది క్రితం సీడబ్ల్యూ సీ, డ్యామ్ సేఫ్టీ కమిటీలు కూడా  ప్రభుత్వానికి ఇవే సిఫారసులు చేశాయి. మొత్తంగా కడెం మోడ్రనైజేషన్​ పనుల కోసం రూ.700 కోట్లు అవసరమని ఇరిగేషన్​ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. కానీ, ఏడాది గడిచినా ఫండ్స్​ విడుదల చేయకపోవడంతో కొత్త గేట్ల బిగింపుతోపాటు కొత్త స్పిల్​ వే ఏర్పాటు పక్కనపడింది.

తాత్కాలిక రిపేర్లతో సరి.. 

ఫండ్స్​ కొరతతో కడెం ఆధునీకరణ పనులను పక్కనపెట్టిన ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా కేవలం రిపేర్ల కోసమే రూ.2 కోట్లు మంజూరు చేసింది.  వాటిని కూడా ఇన్​టైంలో రిలీజ్​ చేయకపోవడంతో ఏప్రిల్, మే ​నాటికి పూర్తిచేయాల్సిన రిపేర్లను ప్రాజెక్టు ఆఫీసర్లు జూన్ ​దాకా లాక్కొచ్చారు. అవసరమైన చోట్ల కౌంటర్ వెయిట్ లు, వరద గేట్ల రూలర్స్, రబ్బర్ సీల్స్, రోప్స్ మార్చాల్సి ఉన్నప్పటికీ కేవలం గ్రీజింగ్, మోటార్ల రిపేర్​ లాంటి పనులను హడావుడిగా పూర్తిచేసి మమ అనిపించారు. ఫలితంగా గత నెల 26న ప్రాజెక్టు15వ నంబర్ గేటు కౌంటర్ వెయిట్ విరిగిపోయింది. ఈ గేటును కిందికి దించేందుకు ప్రాజెక్ట్ అధికారులతో పాటు హైదరాబాద్​ నుంచి వచ్చిన ఎక్స్​పర్ట్స్​చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో రెండువారాలుగా ప్రతిరోజు నీరు రిజర్వాయర్ నుండి వృథాగా వాగులోకి వెళ్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 697 అడుగుల నీటిమట్టం ఉంది. ఆయకట్టు కింద 65 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందుకోసం లెఫ్ట్ కెనాల్ నుంచి రోజూ 865 క్యూసెక్కులు, రైట్ కెనాల్ నుంచి 8 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కానీ, ఇంతకు రెండింతల నీరు వృథాగా పోతుండడం, ఇలాగే పోతే మరో 15 రోజుల్లో కడెం ఖాళీ అయ్యే ప్రమాదం ఉండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టును ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని  డిమాండ్​ చేస్తున్నారు. 

గేటును దించేందుకు ప్రయత్నిస్తున్నం.. 

15వ గేటు కౌంటర్ వెయిట్ విరిగిపోవడం తోనే సమస్య ఏర్పడింది. గేటును కిందికి దించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నం. నేడో, రేపో కాంట్రాక్టు సంస్థకు సంబంధించిన నిపుణులు రాబోతున్నారు. త్వరలోనే రిపేర్లు పూర్తిచేస్తం. ఆయకట్టు రైతులు ఆందోళనకు గురి కావొద్దు.

- బోయదాస్, డీఈ, కడెం ప్రాజెక్టు