ఆ భూముల్లో సాగుచేయొద్దు .. గోండుగూడ గ్రామస్తులకు అధికారుల సూచన

ఆ భూముల్లో సాగుచేయొద్దు .. గోండుగూడ గ్రామస్తులకు అధికారుల సూచన

కడెం, వెలుగు: కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ పంచాయితీ పరిధిలోని గోండుగూడ గ్రామస్తులతో ఆర్డీవో రత్న కల్యాణి, ఎఫ్​డీవో రేవంత్ చంద్ర మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పునరావాస మైసంపేట, రాంపూర్ గ్రామస్తుల కోసంకేటాయించిన భూములకు రెవెన్యూ పట్టాలున్నాయని, వాటిని సాగు చేయొద్దని గ్రామస్తులకు సూచించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఆ భూములను గతంలో తాము సాగు చేశామని, అందుకు తమపై అటవీ అధికారులు కేసులు సైతం నమోదు చేశారని పేర్కొన్నారు. తమకు గుంట భూమి లేదని, ఒక్కో కుటుంబానికి ఎకరం చొప్పున ఇవ్వాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. లేకపోతే ఆ భూముల్లో సాగు చేస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్ ప్రభాకర్, ఎఫ్ఆర్​వో గీతారాణి, ఎస్సై సాయి కిరణ్, ఆర్ఐ శారద మండల అధికారులు పాల్గొన్నారు.

 3 రోజుల్లో పట్టాలిస్తాం

కడెం మండలం మైసంపేట్, రాంపూర్ పునరావాస గ్రామాల వారికి కేటాయించిన భూములను మంగళవారం ఎఫ్​డీవో రేవంత్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమను తరలించి 14 నెలలు గడుస్తున్నా నేటికీ భూముల పట్టాలు పంపిణీ చేయలేదని, ప్యాకేజీ 1 పూర్తిగా ఇవ్వకపోవడంతో జీవనం కష్టమవుతోందని గ్రామస్తులు తమ సమస్యలు విన్నవించుకున్నారు.  స్పందించిన ఎఫ్​డీవో 3 రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తిచేస్తామని, ప్యాకేజీ 1 పూర్తిగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.