దూరదృష్టి కలిగిన వ్యక్తి, పేదల పక్షపాతి కాకా

దూరదృష్టి కలిగిన వ్యక్తి, పేదల పక్షపాతి కాకా
  • వెంకటస్వామి జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ వివేక్‌‌‌‌‌‌‌‌
  • ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌పై కాకా విగ్రహానికి నివాళులర్పించిన ఆయన ఫ్యామిలీ, గవర్నర్ దత్తాత్రేయ 
  • జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పిండు: వివేక్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి ( కాకా) 93వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌పై ఉన్న కాకా విగ్రహానికి బుధవారం ఆయన కుటుంబసభ్యులు వివేక్ వెంకటస్వామి, వినోద్, సరోజా వివేకానంద్, వంశీ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శంకర్ రావు, టీజీవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఓయూ జేఏసీ నేత దాసు సురేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు అభిమానులు, పలు దళిత సంఘాల నేతలు కాకా విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

కాకా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని కాకా విగ్రహ ఏర్పాటు సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చి, మాట తప్పారని కాకా కుమారుడు, మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. నిత్యం పేద ప్రజల గురించి, వారికి మంచి చేయాలని కాకా ఆలోచించే వారన్నారు. గత వారం నుంచి మునుగోడు బై పోల్ ప్రచారం పాల్గొంటున్నానని, అక్కడ ప్రతి ఒక్కరూ కాకాను గుర్తు చేస్తున్నారని చెప్పారు. కాకా నీతి, నిజాయితీతో రాజకీయాలు చేశారని, ప్రజల మనసు గెలుచుకున్నారని వారు తనకు చెబుతున్నారన్నారు.

తాను ప్రధాని మోడీని కలిసినప్పుడు సైతం ఆయన కూడా కాకాను గుర్తు చేసుకున్నారని పేర్కొన్నారు. కాకా జీవిత చరిత్ర తాను చదివానని ప్రధాని తనతో చెప్పారన్నారు. రూరల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మంత్రిగా కాకా ఉన్నప్పుడు ఆ శాఖ బడ్జెట్ రూ.5 వేల కోట్లు ఉంటే, దానిని రూ.28 వేల కోట్లకు పెంచారన్నారు. వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు తాగు నీరు అందించడం, విద్య, ఆరోగ్యం, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కాకా తెచ్చిన ఫెన్షన్ స్కీమ్ ద్వారా కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారని, వారు ఆయన చేసిన మేలుని గుర్తు చేసుకుంటున్నారన్నారు. కాకా జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ వంశీ అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 

పేదల పక్షపాతి..: దత్తాత్రేయ 
కాకా ఎంతో దూరదృష్టి కలిగిన వ్యక్తి, పేదల పక్షపాతి అని బండారు దత్తాత్రేయ అన్నారు. కార్మికులకు పెన్షన్, పీఎఫ్ ఇచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. లక్షల మంది పేద వాళ్లకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గుడిసెలు ఇప్పించేలా కృషి చేసి, వారికి ఆశ్రయం కల్పించిన నేత అని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి కేంద్ర మంత్రి, సీడబ్ల్యూసీ నేత వరకు ఎదిగిన వ్యక్తి అని గుర్తుచేశారు. కార్మికులకు పెన్షన్ ఇచ్చిన నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరి కంటే ముందు ఉండి, హైకమాండ్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా కృషి చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.

రాజకీయంగా తనకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను వివేక్ వెంకటస్వామి సన్మానించారు. మాజీ మంత్రి శంకర్ రావు మాట్లాడుతూ, ఇండ్లు లేని పేదల గురించి ఆలోచించిన వ్యక్తి కాకా అని అన్నారు. కాకా వెంకటస్వామి రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తి అని, కొన్ని కారణాల వల్ల ఆయనకు ఆ పదవి రాలేదన్నారు. కాకాకు పద్మవిభూషణ్ లేదా పద్మభూషణ్ ఇచ్చేలా కేంద్రానికి ఆయన పేరు రెకమెండ్ చేయాలని దత్తాత్రేయకు విజ్ఞప్తి చేశారు. దాసు సురేశ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాకాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.

ఆయన ఆశయాలను అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ముందుకు తీసుకెళ్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కాకా వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై సోనియా గాంధీని ఒప్పించారని, 2004 లో పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చేర్చే విధంగా కాకా కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.