- ఇన్‌చార్జి వీసీ ఆదేశాలతో కదిలిన అధికారులు
- సర్వే కోసం ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ
- కుమార్‌పల్లి, గుండ్ల సింగారం వైపు సర్వే చేపట్టిన ఆఫీసర్లు
- హద్దుల ఏర్పాటు తర్వాతే కాంపౌండ్ వాల్ నిర్మాణం
హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాలను తేల్చేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. వర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నా గత ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి రూ. కోట్లు విలువ చేసే భూములను యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వర్సిటీ భూముల రక్షణకు అడుగులు వేసింది.
ఇందులో భాగంగానే వర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మార్చి 10న రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. అయితే కబ్జాకు గురైన భూములను గుర్తించకుండా, వర్సిటీ హద్దులు నిర్ణయించకుండానే వాల్ నిర్మాణం చేపట్టడంతో ‘వెలుగు’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన ఇన్‌చార్జి వీసీ వాకాటి కరుణ వర్సిటీ ల్యాండ్స్ రక్షణకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సర్వేతో పాటు కాంపౌండ్ నిర్మాణంలో కోఆర్డినేట్ చేసేందుకు వర్సిటీకి చెందిన ఏడుగురు ఆఫీసర్లతో ప్రత్యేకంగా కమిటీని నియమించారు. దీంతో వారంతా ఆదివారం కేయూ భూముల ఫిజికల్ సర్వే పనులకు శ్రీకారం చుట్టారు.
673 ఎకరాల్లో మిగిలిందెంత
ఉస్మానియా పీజీ సెంటర్‌గా కేయూను ఏర్పాటు చేసిన సమయంలో హనుమకొండ మండలంలోని మూడు గ్రామాల నుంచి 673.12 ఎకరాలు సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో కుమార్‌పల్లి శివారులో 188.28 ఎకరాలు, లష్కర్ సింగారం శివారులో 309.20, పలివేల్పుల పరిధిలో 175.14 ఎకరాలు ఉండగా సరైన రక్షణ లేకపోవడంతో వర్సిటీ చుట్టూరా ఆక్రమణలు పుట్టుకొచ్చాయి. ప్రధానంగా కుమార్‌పల్లి శివారు సర్వే నంబర్ 229, లష్కర్ సింగారం శివారు 32, పలివేల్పుల శివారు 412, 413, 414 సర్వే నంబర్లలో భూ ఆక్రమణలు జరిగాయి.
ఈ నేపథ్యంలో 2021లో రాజీవ్‌గాంధీ హనుమంతు కలెక్టర్‌గా ఉన్న టైంలో డీజీపీఎస్ సర్వే నిర్వహించారు. దీంతో ఆక్రమణలు నిజమేనని తేలగా ఆక్రమణదారుల్లో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, కార్పొరేటర్, పోలీస్ ఆఫీసర్లు, మున్సిపల్ ఉద్యోగులతో పాటు వర్సిటీ ఆఫీసర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్‌బాబుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తగా గతంలో ఆయనతో సహా 17 మందికి మున్సిపల్ ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. దీంతోనే కేయూ ల్యాండ్స్ కమిటీలో కొనసాగిన ఆయనను ఆ తర్వాత పదవి నుంచి తొలగించారు. ఇదిలా ఉంటే వర్సిటీ చుట్టూ ఎక్కడికక్కడ ఆక్రమణలు జరగడంతో వర్సిటీ ఏర్పాటు టైంలో సేకరించిన భూమికి, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేదని తెలిసింది.
ఏడుగురు సభ్యులతో కమిటీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వర్సిటీ చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర కాంపౌండ్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసింది. దీంతో వాల్ నిర్మాణానికి మార్చి 10న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క కలిసి శంకుస్థాపన చేశారు. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంపౌండ్ వాల్ నిర్మించనుండగా భూ ఆక్రమణలు, హద్దుల ఏర్పాటు సమస్యగా మారింది. ఇదే విషయాన్ని అకుట్ నేతలు కూడా ఇన్‌చార్జి వీసీ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఇన్‌చార్జి వీసీ వాకాటి కరుణ స్పెషల్ ఫోకస్ పెట్టి కేయూ భూ సమస్యలు పరిష్కరించేందుకు వర్సిటీకి చెందిన ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కేయూ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ టి.మనోహర్‌ను చైర్మన్‌గా నియమించారు. డెవలప్‌మెంట్ మాజీ ఆఫీసర్, ఎస్‌డీఎల్‌సీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రాంచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ సురేశ్‌లాల్, లీగల్ సెల్ డైరెక్టర్ఎం.శ్రీనివాస్, ప్రస్తుత డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ ఇంజినీర్ పి.రామయ్య, బిల్డింగ్స్ డివిజన్ సూపరింటెండెంట్ ఎం.సునీల్‌కుమార్‌ను సభ్యులుగా నియమించారు. ఈ ఏడుగురు సభ్యుల కమిటీ వర్సిటీ భూ సమస్యలు పరిష్కరించడంతో పాటు కాంపౌండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రారంభమైన ఫిజికల్ సర్వే
కేయూ భూముల ఆక్రమణలు తేల్చకుండానే వర్సిటీ అధికారులు ఈ నెల 1న వరంగల్ – -కరీంనగర్ హైవే వైపు కాంపౌండ్ నిర్మాణ పనులు చేపట్టారు. కానీ హద్దులు నిర్ణయించకపోవడంతో పలివేల్పుల, గుండ్ల సింగారం వైపు కేయూ భూములు ఎక్కడి వరకు ఉన్నాయనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ‘వెలుగు’ పేపర్‌లో కథనాలు పబ్లిష్ కావడంతో ఇన్‌చార్జి వీసీ ఆదేశాలతో ఆదివారం సర్వే ప్రారంభించారు.
ముందుగా హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్ ఆధ్వర్యంలో కేయూ ల్యాండ్ రికార్డ్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆర్డీవో వెంకటేశ్, రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి, ఏడుగురు కమిటీ మెంబర్స్, ఇతర ఆఫీసర్లతో శనివారం సమావేశమై, ఆదివారం కుమార్‌పల్లి, గుండ్ల సింగారం, ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంతంలో సర్వే చేశారు. రెండు రోజుల పాటు సర్వే నిర్వహించి, పూర్తి స్థాయిలో హద్దులు నిర్ణయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అక్రమార్కుల్లో గుబులు
కేయూ భూముల సర్వే మొదలు కావడంతో ల్యాండ్స్ కమిటీ రిపోర్ట్‌కు సైతం మోక్షం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండ్స్ కమిటీ రిపోర్ట్‌ను ఆమోదించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేందుకు ఇన్‌చార్జి వీసీ, ఆఫీసర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వర్సిటీ భూముల ఆక్రమణదారుల్లో గుబులు మొదలు కాగా, వారందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది.
కాగా ఆక్రమణదారుల్లో కొందరు పొలిటికల్ లీడర్స్, ఆఫీసర్లు ఉండడంతో ఎలాంటి పక్షపాతం లేకుండా వర్సిటీ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని కేయూ ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.