- గతేడాది రూ.90 కోట్లతో నయీంనగర్ బ్రిడ్జి, నాలా నిర్మాణం
- ప్రమాదం నుంచి బయటపడ్డ పదుల సంఖ్యలో కాలనీలు
వరంగల్, వెలుగు: మొంథా తుపాన్ గ్రేటర్ వరంగల్‍పై విరుచుకుపడ్డ నేపథ్యంలో హనుమకొండలోని పదుల సంఖ్యలో కాలనీలు నయీంనగర్ నాలా నిర్మాణంతో సేఫ్ గా బయటపడ్డాయి. దాదాపు రూ.90 కోట్లతో గతేడాది నయీంనగర్ కొత్త బ్రిడ్జి నిర్మాణంతో పాటు నాలా అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో 30 ఫీట్ల వరకు కుంచించుకుపోయిన నయీంనగర్ బ్రిడ్జి నుంచి పెగడపల్లి డబ్బాలు వెళ్లే దారి వరకు నాలాను 80 మీటర్ల పరిధిలో విస్తరించారు. అంతేగాక.. ఇరువైపులా 10–12 ఫీట్ల ఎత్తులో సిమెంట్ కాంక్రీట్ తో రిటైనింగ్ వాల్ నిర్మించారు.
గతంలో 16 మీటర్ల విస్తరణతో ప్రమాదకరంగా ఉన్న నయీంనగర్ పాత బ్రిడ్జిని 24.5 మీటర్లకు పెంచారు. కింది భాగంలో వరదనీరు సాఫీగా వెళ్లేలా 10 మీటర్ల అడుగుతో 3 ఖానాలు ఏర్పాటు చేశారు. 32 మీటర్ల పొడవు ఉండే బ్రిడ్జి నిర్మాణంలో చివర లో ఉండే పిల్లర్లతో సంబంధం లేకుండా మధ్యలో 2 బలమైన పిల్లర్లు వేశారు.
దీంతో ఇటీవల వచ్చిన వర్షాలతో పాటు బుధవారం మొంథా తుపాన్ ఎఫెక్ట్ తో వచ్చిన భారీ వరద నాలా ద్వారా సిటీ దాటి బయటకు వెళ్లగలిగింది. దీంతో నయీంనగర్, రాజాజీ నగర్, ఆదర్శ నగర్, గోపాల్‍పూర్ జంక్షన్, లష్కర్ సింగారం, రంగ్ బార్, కిషన్‍పురా, ఈద్గా, బొక్కలగడ్డ, పోచమ్మకుంట, శ్రీనగర్ కాలనీ, ప్రేమ్‍నగర్ కాలనీ, పెగడపల్లి డబ్బాలు, హనుమాన్‍నగర్, సగర కాలనీ వంటి పదుల సంఖ్యలో కాలనీలు వరద భారీ నుంచి బయటపడ్డాయి.
