టీడీపీలో మరో విషాదం ... 3 రోజుల్లో ఇద్దరు నేతలు గుండెపోటుతో మృతి

 టీడీపీలో మరో విషాదం ... 3 రోజుల్లో ఇద్దరు నేతలు గుండెపోటుతో మృతి

టీడీపీలో మరో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ మాజీ చైర్మన్  వరుపుల రాజా (47) శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో  కన్నుమూశారు. శనివారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 11.20 గంటల సమయంలో  వరుపుల రాజా కన్నుమూసినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. గతంలో రాజాకు రెండుసార్లు గుండెపోటు రావడంతో స్టంట్లు వేశారు. కాగా  ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రాజా.. డీసీసీబీ ఛైర్మన్‌గా, ఆప్కాబ్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక మూడు రోజుల కిందిట మరో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు గుండెపోటుతో మృతి చెందారు. వరుసగా ఇద్దరు నేతలు గుండెపోటుతో చనిపోవడంతో ఆ పార్టీలో విషాద ఛాయాలు నెలకొన్నాయి.