మళ్లీ ముంచిన కాళేశ్వరం బ్యాక్​వాటర్

మళ్లీ ముంచిన కాళేశ్వరం బ్యాక్​వాటర్
  • భద్రాచలం వద్ద10 లక్షల క్యూసెక్కులు
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన ఆఫీసర్లు 

భద్రాచలం, వెలుగు: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఉపనదుల నుంచి వస్తున్న వరదతో గోదావరి పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 10 లక్షల18వేల 806 క్యూసెక్కుల వరద ప్రవహం ఉంది. నీటిమట్టం 45.10 అడుగుల మేరకు చేరుకోవడంతో  సాయంత్రం 4 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. ఎగువన కాళేశ్వరం, ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. క్రమంగా వరద పెరుగుతున్నందున 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. దీంతో జిల్లా కలెక్టర్​ హుటాహుటిన భద్రాచలం చేరుకుని సబ్​ కలెక్టర్​ ఆఫీసులో  అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్​ ఈఈ రాంప్రసాద్​, ఇతర ఆఫీసర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాకల్లో సెక్టోరియల్​ ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.  ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​.. కలెక్టర్​తో పాటు ఇతర ఆఫీసర్లకు సూచించారు.  చెరువులు, కుంటలు, వాగులు, ఉపనదులు, నదులు దాటొద్దని ఎస్పీ డా.వినీత్​ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

నిండు కుండల్లా ప్రాజెక్టులు గేట్లెత్తిన అధికారులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి.  సోమవారం సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు 47 గేట్లను ఓపెన్​ చేసి 6.45 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈప్రాజెక్టు  పూర్తి కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.311 టీఎంసీల నీళ్లున్నాయి. మేడి గడ్డ బ్యారేజ్ దగ్గర సోమవారం రాత్రి 7 గంటలకు 10.07 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా బ్యారేజ్ 85 గేట్లను తెరిచి నీటిని పంపిస్తున్నారు. 16.17 టీఎంసీల కెపాసిటీ కి గాను ఆఫీసర్లు నీటిని నిల్వ చేయకుండా ఫ్రీ ఫ్లో పాటిస్తున్నారు. ఎస్ఆర్ఎస్​పీకి  సోమవారం ఉదయం నుంచి 1,83,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ ఏఈ రవి తెలిపారు. 30 గేట్లను ఎత్తి  1,99,928 క్యూసెక్కులను  వదులుతున్నారు.  భైంసా శివారులోని గడ్డెన్న ప్రాజెక్టుపూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా.. ఆదివారం 358.60 మీటర్లకు చేరుకుంది. 20వేల క్యూసెక్కుల ఇన్​ ఫ్లో ..అవుట్​ఫ్లో కొనసాగుతోంది. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద పోటెత్తడంతో సోమవారం 14 గేట్లను 10 ఫీట్లు ఎత్తి 2,06,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ఏడు గేట్ల ద్వారా లక్షా 70 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులో 4.747 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని 41 గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. 2,27,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 2,29,274 క్యూసెక్కులను వదులుతున్నారు.  

కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో 3 వేల ఎకరాలకు పైగా పంట నష్టం

పెద్దపల్లి/చెన్నూర్:  పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల రైతులను కాళేశ్వరం బ్యాక్​వాటర్ మరోసారి ముంచింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు బ్యారేజీల గేట్లన్నీ ఖుల్లా పెట్టినప్పటికీ వరద వెంట వెంటనే డిశ్చార్జి కాకుండా నదికి ఇరువైపులా ఉన్న పంట పొలాలను ముంచెత్తింది. దీంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో   3 వేల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. కరీంనగర్​ జిల్లాలో ఎల్​ఎండీ గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లాలో మానేరు నది కూడా పొంగి ప్రవహిస్తోంది. సుల్తానాబాద్​ మండలం తొగర్రాయి వద్ద నిర్మించిన చెక్​డ్యాం వరదకు కొట్టుకుపోయింది. అటు ఎల్లంపల్లి నుంచి వస్తున్న వరదతో పార్వతి, సరస్వతి బ్యారేజీల వద్ద ఇన్ ఫ్లో ఒక్కసారిగా పెరిగింది. దీంతో మానేరు నుంచి వస్తున్న వరద వెనక్కి తన్ని(ఎగపోటు)  పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్​, కాల్వశ్రీరాంపూర్​ మండలాల్లోని వేలాది ఎకరాల వరి, పత్తి చేన్లు నీటమునిగాయి. గోదావరి బ్యాక్​వాటర్​ కారణంగా మంథని మండలంలోని మల్లారం, ఖానాపూర్​ గ్రామాల పరిధిలోని పంటలు నీళ్లపాలయ్యాయి. అటు కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో చెన్నూర్ నియోజకవర్గంలోని సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈ సీజన్​లో  నాలుగో సారి మునగడంతో అన్నారం బ్యారేజీ దిగువన ఉన్న సుందరశాల, రాంపూర్, దేవులవాడ గ్రామాల్లోని పత్తి, మిర్చి చేన్లు, పొలాలు పనికిరాకుండా పోయాయని రైతులు అంటున్నారు. జులైలో మొదటిసారి దెబ్బతిన్న పంటలను చెడగొట్టి మళ్లీ వేసుకోగా, ఇప్పుడు మళ్లీ మునగడంతో ఎకరానికి రూ.30వేలకు పైగా నష్టపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు.