కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టు రెడీ!..ఆగస్టు 1 లేదా 2న సర్కారుకు చేరే అవకాశం

కాళేశ్వరం కమిషన్  ఫైనల్ రిపోర్టు రెడీ!..ఆగస్టు 1 లేదా 2న సర్కారుకు చేరే అవకాశం
  • ఈ నెల 31 నాటికి పూర్తికానున్న అన్ని ఫార్మాలిటీస్ 
  • ప్రజాప్రతినిధులపై సుప్రీంకోర్టులో ఉన్న కేసునూ పరిశీలిస్తున్న కమిషన్​
  • నేరుగా ఇరిగేషన్ సెక్రటరీకే రిపోర్టు.. అక్కడి నుంచే ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​తుది నివేదిక సిద్ధమైంది. ఇప్పటికే నివేదికలో అన్ని అంశాలను పొందుపరిచిన కమిషన్ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్.. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలిసింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా లొసుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న కమిషన్​.. ఈ నెల 31 నాటికి సమగ్రమైన రిపోర్టును సిద్ధం చేసే పనిలో ఉంది. ఆ రిపోర్టు సిద్ధమయ్యాక.. ఆగస్టు 1 లేదా 2వ తేదీన ప్రభుత్వానికి చేరే అవకాశాలున్నాయి.

 అయితే, రిపోర్టును నేరుగా ప్రభుత్వానికి కాకుండా.. తొలుత ఇరిగేషన్​శాఖకు అందించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. కమిషన్​ఆఫీసు నుంచి రిపోర్టును ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి స్వీకరించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. ఇరిగేషన్​ సెక్రటరీ ఆ తర్వాత చీఫ్​ సెక్రటరీకి.. అక్కడి నుంచి ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​, సీఎం రేవంత్​కు చేరే అవకాశాలున్నాయని సమాచారం. 

సుప్రీంకోర్టు కేసును ఫాలో అవుతున్న కమిషన్​..

రిపోర్టును తయారు చేస్తున్న కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​.. ప్రజాప్రతినిధులపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసును దగ్గర్నుంచి పరిశీలిస్తున్నట్టు తెలిసింది. లంచం లేదా ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చా లేదా అన్న అంశంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అలాంటి నేతలపై అనర్హత వేటుపై తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నది. 

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ సీఎం, గజ్వేల్​ ఎమ్మెల్యే కేసీఆర్​తో పాటు మాజీ మంత్రులు హరీశ్​ రావు, ఈటల రాజేందర్​కూడా కమిషన్​ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తీర్పు కమిషన్​ రిపోర్టుపై ఎలాంటి ప్రభావం చూపించబోదని చెబుతున్నా.. ఆ కేసును కూడా కమిషన్​ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నది. 

ఏడాదిపాటు సుదీర్ఘ విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్​ 21న భారీ శబ్దం చేస్తూ కుంగిపోయింది. ఇప్పటికే దానిపై విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ విచారణ జరిపి.. గత ఫిబ్రవరిలో సర్కారుకు రిపోర్టు ఇచ్చింది. 39 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. 2024 మార్చిలో సర్కారు దేశ తొలి లోక్​పాల్, సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జి జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ చైర్మన్​గా జ్యుడీషియల్​కమిషన్​ను ఏర్పాటు చేసింది. జూన్​ చివరి వారంలో ఇక్కడికి వచ్చిన చైర్మన్​ జస్టిస్​ ఘోష్​.. విచారణను మొదలుపెట్టారు. 

తొలి దశలో భాగంగా అధికారులను పిలిచి వారి నుంచి వివరణ తీసుకున్న జస్టిస్ ఘోష్​.. అందరి నుంచి అఫిడవిట్లను తీసుకున్నారు. అయితే, అనేక దశల్లో విచారణ చేయాల్సి ఉండడం.. ఓపెన్​ కోర్టులు నిర్వహించాల్సి రావడంతో వివిధ దఫాలుగా ఏడు సార్లు కమిషన్​ గడువును సర్కారు పొడిగించింది. ఈ నెల 31తో కమిషన్​ గడువు ముగియనుంది. ఆలోపే కమిషన్​ రిపోర్టును పూర్తి చేయనుంది. కాగా, విచారణలో భాగంగా కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ సహా మొత్తం 119 మందిని కమిషన్​ విచారించింది.