
- భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి
- మహిళలను కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్రు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఇండ్ల గృహప్రవేశాలు
గద్వాల/వనపర్తి/అడ్డాకుల, వెలుగు : కమీషన్ల కోసమే కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఇప్పుడది కూలిపోయే స్థితికి చేరుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం సమీపంలోని దౌదరపల్లి దర్గా వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు.
పదేండ్లుగా ఇండ్లు ఇచ్చి ఉంటే పేదలందరికీ సొంతిళ్లు ఉండేవి..
పేదలకు భరోసా, భద్రత, ధైర్యం ఇల్లు అని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి అన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి రెండు లక్షల చొప్పున ఇండ్లు ఇచ్చి ఉంటే.. రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు ఇల్లు వచ్చేదన్నారు. పేదలకు ఇండ్లు ఇస్తే తమకేమీ రాదని.. కాళేశ్వరం కడితే కమీషన్ వస్తుందనే ఆశతోనే లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును కట్టారన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. ఇందుకు రూ.22,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రతి సోమవారం ఇండ్ల నిర్మాణ పురోగతిని సమీక్షిస్తున్నామని, దశల వారీగా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఆఫీసర్లు పేదల పక్షపాతంగా వ్యవహరించాలని, అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నం..
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రతి హామీని నెరవేరుస్తున్నామని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వాన్ని ప్రజలు శభాష్ అని మెచ్చుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వంపై ఉండాలన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలను లక్షాధికారులను చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు.
మాది దొరల ప్రభుత్వం కాదని.. పేదల ప్రభుత్వం అన్నారు. గద్వాలలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. రూ.9 కోట్ల చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు. మూసాపేటలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలితో పాటు కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే జీఎంఆర్ కొత్త బట్టలను అందించారు.