కేసీఆర్, హరీశ్ ఒత్తిడితోనే .. కాళేశ్వరం డిజైన్లకు ఆమోదం..

కేసీఆర్, హరీశ్ ఒత్తిడితోనే .. కాళేశ్వరం డిజైన్లకు ఆమోదం..
  • కాళేశ్వరం కమిషన్ ఎదుట కుండబద్దలు కొట్టిన 
  • సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి  
  • పైస్థాయిలో మేం చూసుకుంటాం కదా? నీకేంటి ప్రాబ్లం అన్నరు 
  • బలవంతంగా చెక్ లిస్ట్​పై సంతకాలు  
  • బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, నాణ్యత.. అన్నింటిలోనూ తప్పిదాలు  
  • సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాత కూడా డీపీఆర్​లో మార్పుచేర్పులు
  • ప్రాజెక్టు ప్రతి డిజైన్‌‌‌‌లోనూ తలదూర్చిన ఎల్అండ్​టీ కంపెనీ 
  • నిర్మాణాలను తనిఖీ చేసేందుకు గత ప్రభుత్వం తనను అనుమతించలేదని వెల్లడి    

హైదరాబాద్, వెలుగు: నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ ​మంత్రి హరీశ్​రావు ఒత్తిళ్లతోనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం తెలిపానని స్టేట్ ​సీడీవో(సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) మాజీ ఈఎన్సీ నరేందర్‌‌‌‌ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లను పరిశీలించేందుకు తనకు కనీస సమయం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్ ఎదుట అంగీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ ​పీసీ ఘోష్​ కమిషన్ ఓపెన్ ​కోర్టులో భాగంగా గురువారం సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ ​రెడ్డిని క్రాస్​ ఎగ్జామినేషన్​ చేసింది.

ఈ సందర్భంగా జస్టిస్​ పీసీ ఘోష్​ అడిగిన ప్రశ్నలకు నరేందర్​రెడ్డి సమాధానాలు ఇచ్చారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, క్వాలిటీ చెకింగ్​.. ఇలా అన్నింటిలోనూ తప్పులు జరిగాయని ఆయన వెల్లడించారు. ‘‘కాళేశ్వరం డిజైన్లలో హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్‌‌‌‌కు సంబంధించిన అంశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు చెక్​లిస్ట్​ మొత్తానికి బాధ్యత వహిస్తూ సంతకం చేయలేనని హైదరాబాద్​లోని కాళేశ్వరం చీఫ్​ ఇంజనీర్​కు తేల్చి చెప్పాను.

ఆ వెంటనే నాపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. పైఅధికారులు, అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్​ మంత్రి హరీశ్​ ఫోన్లు చేసి చెప్పారు. ‘పై స్థాయిలో మేమున్నాం కదా.. మీకేం ప్రాబ్లం.. సంతకాలు పెట్టండి’ అంటూ నాతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు’’ అని కమిషన్​ ఎదుట నరేందర్​రెడ్డి వాపోయారు.  

ఎల్అండ్​టీ మాట మార్చింది..  

‘కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్​లను ప్రీమెచ్యూర్ స్టేజ్​లోనే సర్టిఫై చేశారా?’ అని కమిషన్​ ప్రశ్నించగా.. నరేందర్​ రెడ్డి వివరంగా సమాధానం ఇచ్చారు. ‘డిజైన్లకు సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే నేను జవాబుదారీని. కానీ హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్‌‌‌‌కు సంబంధించిన అంశాల చెక్​లిస్టుపైనా సంతకాలు పెట్టాలని నాపై ఒత్తిడి తెచ్చారు. 

ఇలా చేయలేనని కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ కు స్పష్టం చేశాను. కానీ ఉన్నతాధికారులు, సీఎం, ఇరిగేషన్​మినిస్టర్​ఒత్తిళ్ల మేరకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది.  మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి డిజైన్లను 2017 మార్చి 29న రిలీజ్ చేశాం. ఈ బ్యారేజీకి సంబంధించిన ప్రతి కాంపొనెంట్ డిజైన్‌‌‌‌లోనూ ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సీడీవో సీఈ (అప్పట్లో చీఫ్ ఇంజినీర్)గా నేను రూపొందించిన ప్రతి డిజైన్‌‌‌‌లోనూ ఎల్ అండ్ టీ సంస్థ తలదూర్చి, సమాంతర డిజైన్లు ఇచ్చింది. కానీ నాణ్యత లోపాలు బయటపడ్డాక, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ తప్పుకున్నది.

పూర్తి బాధ్యత సీడీవోదే అంటూ మాట మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ఫైనల్ చేయడానికి ముందు వివిధ అంశాలపై రూపొందించిన చెక్ లిస్ట్​కు సంబంధించి 2017 ఫిబ్రవరి 21న రూపొందించిన లెటర్‌‌‌‌లోనే తిరకాసు ఉన్నది. చివరకు సీడీవో పేరిటే డిజైన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ తర్వాత ఆ లెటర్‌‌‌‌లో కొన్ని పదాలను తొలగించినట్లు గుర్తించాను. ఇందుకోసం ఆర్టీఐ యాక్ట్​ద్వారా ఒరిజినల్ లెటర్‌‌‌‌ను తెప్పించుకోవాల్సి వచ్చింది. 

అప్పటి సీఎం, ఇరిగేషన్​మంత్రి ఉద్దేశపూర్వకంగా తాము సేఫ్ జోన్‌‌‌‌లో ఉండేందుకు ఆ పదాలను డిలీట్ చేశారు’’ అంటూ నరేందర్‌‌‌‌ రెడ్డి కమిషన్‌‌‌‌కు వివరించారు. ఈ మేరకు ఆర్టీఐ రిప్లై కాపీని కమిషన్​కు అందజేశారు. ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు చాలాసార్లు సమావేశమైనప్పటికీ ఆ మీటింగులకు తనను ఎన్నడూ ఆహ్వానించలేదన్నారు.

కేవలం బ్యారేజీలు కట్టే లొకేషన్లను మాత్రమే తనకు పంపి డిజైన్లు ఆమోదించాలని ఆదేశించారని చెప్పారు. డిజైన్, డ్రాయింగ్‌‌‌‌లలో భాగంగా 2-డీ డిజైన్లను రూపొందించామని, 3-డీ మోడల్ స్టడీస్ పూర్తయిన తర్వాత డిజైన్లు రూపొందించాల్సి ఉన్నా.. అప్పటి సీఎం, మంత్రి ఒత్తిళ్ల కారణంగా అలా జరగలేదన్నారు.  

 

బ్యారేజీల నిర్మాణం టైమ్​లోనే లోపాలు..
 

‘కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల నిర్ణయం వెనక ఎవరున్నారు?’ అని కమిషన్​ప్రశ్నించగా.. మేడిగడ్డ లొకేషన్ ఎక్కడ, ఎలా ఖరారైందో తనకు తెలియదని, కాంట్రాక్టు సంస్థతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కాపీని కూడా తాను రిటైర్ అయ్యేవరకూ ఇవ్వలేదని నరేందర్​రెడ్డి బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు, తప్పిదాలు జరిగాయని తెలిపారు. కేంద్ర జల సంఘానికి అప్రూవల్ కోసం డీపీఆర్ పంపి ఆమోదంతో తిరిగొచ్చిన తర్వాత కూడా అందులో మార్పులు జరిగాయని చెప్పారు. ‘‘డిజైన్‌‌‌‌కు తగినట్లుగా నిర్మాణం జరుగుతున్నదో లేదో తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ అందుకు గత ప్రభుత్వం అనుమతించలేదు.

అందువల్లే నేను అటువైపు వెళ్లలేదు. నిర్మాణం ప్రారంభం కావడానికి ముందే నేను మేడిగడ్డ సైట్‌‌‌‌ను చూశాను. ఆ తర్వాత విజిట్ చేయలేదు. నిర్మాణం తర్వాత బ్యారేజీ నిర్వహణలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకున్నది. కనీస స్థాయిలో జరగాల్సిన మెయింటెనెన్స్ కూడా చేయలేదు” అని వెల్లడించారు. రేడియల్ గేట్లను మెకానికల్‌‌‌‌గా ఆపరేట్ చేయడం, షూటింగ్ వెలాసిటీ, బెడ్ లెవల్, రాఫ్ట్ కు పైల్ క్యాప్‌‌‌‌కు మధ్య ఫ్లెక్సిబిలిటీ తదితర అంశాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), సీబీఐపీ మాన్యువల్స్ లోని ప్రమాణాలకు అనుగుణంగానే డిజైన్లు, డ్రాయింగ్ రూపొందించినట్లు తెలిపారు. ‘ఫ్లడ్​ షూటింగ్​వెలాసిటీ 6 మీటర్లు ఫర్ సెకన్​కు మాత్రమే డిజైన్​ చేశారు. 

కానీ 15 నుంచి16 మీటర్లు ఫర్ సెకన్​ఉంది కదా?’ అని కమిషన్​ప్రశ్నించగా..  ‘అవును అది నిజమే’ అని నరేందర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇక కమిషన్ హెడ్‌‌‌‌గా జస్టిస్ పీసీ ఘోష్ లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు  దాటవేశారు. మరికొన్నింటిని నాట్ అగ్రీడ్, ఐ డోన్డ్ నో... అంటూ రిప్లై ఇచ్చారు. తాము రూపొందించిన డిజైన్లు, డ్రాయింగ్‌‌‌‌లను ఒక అథారిటీగా తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ ధ్రువీకరించిందని.. కానీ నిర్మాణం సమయంలో ఎల్ అండ్ టీ సంస్థ వాటిని పాటించలేదని పేర్కొన్నారు.  


ఫ్లడ్​లైట్ల వెలుతురులో హడావుడిగా పనులు.. 

 

కాళేశ్వరం బ్యారేజీలు గడువులోగా పూర్తి చేయాలనే తొందర్లో రాత్రింబవళ్లు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు చేశారని.. ఈ హడావుడి వల్లే క్వాలిటీ కంట్రోల్ చెక్, గేట్ల ఆపరేషన్, బ్యారేజీల నిర్వహణ సరిగా జరగలేదని లేదని మాజీ ఈఎన్​సీ నరేందర్​రెడ్డి చెప్పారు. ‘‘వాస్తవానికి ఫ్లడ్​లైట్ల వెలుతురులో సీకెంట్​పైల్స్ పనులు చేయకూడదు. కానీ 5 వేల సీకెంట్​పైల్స్​ను అలాగే వేశారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ అయ్యాక చక్కదిద్దడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదు.

డిజైన్ విషయంలో సీడీవో సీఈగా నాపై అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు ఎలా ఒత్తిడి తీసుకొచ్చారో.. నిర్మాణం విషయంలోనూ అదే తరహా హడావిడి చేశారు. అందువల్లే నష్టం జరిగింది. డ్యామ్‌‌‌‌తో పోలిస్తే బ్యారేజీలకు కొన్ని పరిమితులు, అనుకూలతలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్‌‌‌‌గా, పీరియాడికల్‌‌‌‌గా జరగాల్సిన తనిఖీలు, దిద్దుబాటు చర్యలు, మెయింటెనెన్స్ తదితరాలను చేపట్టాల్సి ఉన్నది. కానీ ఈ అంశాలకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు.

నిజానికి బ్యారేజీలకు డిజైన్, డ్రాయింగ్ రూపొందించిన తర్వాత అందుకు తగినట్లు నిర్మాణం జరుగుతున్నదో లేదో చూడాల్సిన బాధ్యత సీడీవో చీఫ్ ఇంజినీర్ దే. కానీ అందులో నాకు ఎలాంటి రోల్ లేకుండా పోయింది. చెకింగ్​ చేసే అవకాశం ఇవ్వలేదు” అని వాపోయారు. తాను ఏనాడూ కాళేశ్వరంపై జరిగిన చర్చలు, సమావేశాల్లో పాల్గొననందున.. ఆ  ప్రాజెక్టు ప్రతిపాదనలు, కాన్సెప్ట్ ఎవరిదో తనకు తెలియదని కమిషన్​కు నరేందర్​రెడ్డి తేల్చి చెప్పారు.