ఓటరే దేశానికి ఓనర్..

ఓటరే దేశానికి ఓనర్..
  • కేంద్ర గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి
  • అందరూ ఓటు నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచన
  • దళిత ఆశయాలు బీజేపీతోనే తీరుతయ్: కొండా విశ్వేశ్వర్​రెడ్డి

పరిగి, వెలుగు: రాష్ట్రంలో కుంటుంబ పాలన కొనసాగుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని కేంద్ర గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి విమర్శించారు. ప్రపంచ దేశాల్లో శ్రీలంకలో వారసత్వం కొనసాగుతోందనే నానుడి ఉండేదని, శ్రీలంక మాదిరిగానే ప్రస్తుతం తెలంగాణలో వారసత్వ రాజకీయాలు ఉన్నాయని అన్నారు. అవినీతి, కుటుంబ పాలనను తరిమికొట్టాలని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు.

శనివారం పరిగి నియోజకవర్గంలోని పరిగి, రంగంపల్లి, రూప్ ఖాన్ పేట, కుల్కచర్ల మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. పరిగి మండల కేంద్రంలోని ఓ హోటల్​లో స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు దేశానికి ఓనరేనని, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. మనదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలోకి చేరిందని, ఈ క్రమంలో ఇంగ్లండ్​ను వెనక్కి నెట్టామన్నారు. పదేండ్ల క్రితం దేశంలో విద్యుత్ కొరత విపరీతంగా ఉండేదని, ప్రస్తుతం దేశంలో మిగులు విద్యుత్ ఉందని, ఇంతటి అభివృద్ధి మోడీ కృషి వల్లే సాధ్యమైందని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులకు నిధులు వచ్చేవి కావని, మోడీ వచ్చిన తర్వాత నిధులు నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లో పడుతున్నాయని చెప్పారు. ఇండియా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రంగంలో దూసుకుపోతోందని, రోజు సగటున 36 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవేల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రైల్వే లైన్లు నిర్మించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యంలో 85% కేంద్రం నిధులు చెల్లిస్తోందని చెప్పారు. కరోనా తర్వాత ప్రపంచ దేశాలు అనేక సమస్యలతో సతమతమయ్యాయని, కానీ మనదేశం కరోనా నుంచి త్వరగా కోలుకుని దేశ పరిస్థితులను చక్కదిద్దుకుందన్నారు. స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని, స్కిల్ ఇండియా ప్రోగ్రాం ద్వారా పేద విద్యార్థుల్లో నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తోందని అన్నారు. దళితుల ఆశయాలను నెరవేర్చడం బీజేపీ వల్లే సాధ్యమవుతుందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కల్వకుంట్ల దరిద్రం ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.