కాళేశ్వరం ప్రాజెక్టు వండర్ కాదు బ్లండర్

కాళేశ్వరం ప్రాజెక్టు వండర్ కాదు బ్లండర్

‘నేను కాళేశ్వరం కడుతున్నా... 2 సంవత్సరాల్లో కాళేశ్వరంపై పెట్టిన ఖర్చుకు సమాన లాభం వస్తుంది. ఇప్పుడు రోజుకు 2 టీఎంసీలకు ప్రాజెక్టు డిజైన్ చేశాం. 6 నెలలు రోజుకు 2 టీఎంసీల చొప్పున 360 టీఎంసీలు ఎత్తిపోసి 36లక్షల ఎకరాలకు నీరిస్తాం. తర్వాత సంవత్సరంలో 3వ టీఎంసీకి డిజైన్ చేసి, రోజుకు 3 టీఎంసీల చొప్పున 6 నెలలు (180 రోజులు) 540 టీఎంసీలు ఎత్తిపోస్తాం. తద్వారా 54లక్షల ఎకరాలకు నీరిస్తాం. హైదరాబాద్​కు తాగునీరిస్తాం, పరిశ్రమలకు కావాల్సిన నీరిస్తాం... దీంతో పంటలే పంటలు... ఉపాధి అవకాశాలు లభిస్తాయి... ఎత్తిపోతలకు విద్యుత్ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.  2018 ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్య అది.

కాళేశ్వరం నీళ్లు వానాకాలం ఎత్తిపోయలేరు, ఎండాకాలం ఎత్తిపోద్దామంటే నీళ్లుండవు. ఇది పూర్తిస్థాయి ఉపయోగానికి రాని ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎవరూ కట్టలేదు, ఇది మన కేసీఆర్​కు మాత్రమే సాధ్యం. హృదయం లేని సర్కారు, సామర్థ్యం లేని కాళేశ్వరం ఇంజినీర్లు, ఎంత దొరికితే అంత దోచుకునే కాంట్రాక్టర్లు కలిసి కట్టిన గూగుల్ మ్యాప్ ప్రాజెక్టు ఇది, ఏమాత్రం పనికిరాని ప్రాజెక్టు. మూడు సంవత్సరాలలో కట్టిన అద్భుతమైన ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును దేశంలో, అమెరికాలో, ప్రపంచంలో ఆహా ఓహో అని ప్రచారం చేశారు. ప్రాజెక్టు 2019 జూన్​లో ప్రారంభమైంది. 36 లక్షల ఎకరాలకు నూతన స్థిరీకరణ ఆయకట్టుకు నీరిస్తామని చెప్పిన కేసీఆర్ ఈ రోజు వరకు 36వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. లక్ష కోట్లపైన అప్పు, దానిపై తడిసి మోపెడయిన వడ్డీ రాష్ట్ర ప్రజలపై భారం పడుతోంది. దీనికి తోడు లిఫ్టు చేసిన విద్యుత్ బిల్లులు రూ.9000 కోట్లు పెండింగ్​లోనే ఉన్నాయి.

గత సంవత్సరం మేడిగడ్డ, అన్నారం వద్ద మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ప్యానల్ బోర్డులు, స్టార్టర్లు అన్నీ వరదలో మునిగిపోయాయి. సేఫ్టీ వాల్స్ కూలిపోయాయి. నేడు బ్యారేజీ కుంగిపోయింది. మిగతా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద బుంగలు వస్తున్నాయి. ఇవి రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టు మొదటి నుంచి వయబులిటీ లేదంటే వినలేదు, ఇప్పుడది కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఈ ప్రాజెక్టు కట్టిన నాలుగు సంవత్సరాలలో బడ్జెట్​లో ఆపరేషన్స్ కు, మెయింటెనెన్స్​కు  బడ్జెట్ కేటాయింపులు లేవు. మరి, ప్రపంచంలోనే అద్భుతమైన ఈ ప్రాజెక్టు ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది. కేసీఆర్, హరీష్ రావు కడుపుకట్టుకొని కట్టిన ప్రాజెక్టు ప్రజల పొట్ట కొడుతున్నది.

ఎన్​డీఎస్​ఏ బయటపెట్టిన అవకతవకలు

మేడిగడ్డ సముద్ర మట్టానికి 100 మీటర్ల లెవల్లో ఉంటే, 99 మీటర్ల లెవల్లో పంపులు అమర్చారు. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ స్టడీ చేయలేదు. సర్వే సమగ్రంగా లేదు. ప్రాజెక్టు డిజైన్​లో సాంకేతిక లోపాలున్నాయి. నిర్మాణ పదార్థాల నాణ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం పునాది కింద ఇసుక కొట్టుకుపోయింది. ఫౌండేషన్​కు ఉపయోగించిన మెటీరియల్ సరిగ్గా లేదు. బ్యారేజీపై రోడ్డు ఉండడం సాంకేతిక వైఫలం అయ్యింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యంగా ఉన్నాయి. బ్యారేజీని నీటిపై తేలేటట్టు చేసి, కాంక్రీట్ స్ట్రక్చర్ నిర్మించారు. 7వ బ్లాక్ లోని 11 పిల్లర్లను పునాదులతో సహా తొలగించాలి. మరమ్మతు చేయరాదు, మిగతా బ్లాకులు కూడా ఇలానే ఉంటే బ్యారేజ్ మొత్తం కొత్తది కట్టాలి. అన్నారం, సుందిళ్లను కూడా పరిశీలించాలి. 20 రిపోర్ట్స్ అడిగితే 11 మాత్రమే ఇచ్చారు. రిపోర్టు అడిగితే ప్రభుత్వం బెంబేలెత్తిపోతోంది. 10 టీఎంసీల నీటిని వదిలేశారు. ఈ రిపోర్టును కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. రిపోర్టు ఇచ్చింది బీజేపీ కాదు, జాతీయ స్థాయి నిపుణులైన, అనుభవజ్ఞులైన ఇంజినీర్లు అని తెలుసుకోవాలి.

వయబులిటీ లేదు

మొదటి నుంచి ఈ ప్రాజెక్టు వయబులిటీ కాదని అనేక మంది మేధావులు చెప్తున్నారు. ఇది కాస్ట్ బెనిఫిట్ (ఖర్చు-ఆదాయం) వయబులిటీ (అనుకూలత) లేదు. బ్యారేజీ అడుగున సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేయలేదు. సాంకేతిక లోపాలు ఉన్నాయి. 9 నెలలకు డెలివరీ కావాల్సిన దాన్ని 5 నెలలకే డెలివరీ చేశారు. అందుకే ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయ్యింది. నెలకు 1.30లక్షల క్యూబిక్ మీటర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. కానీ క్వాలిటీ చూడలేదు. బ్లాస్టింగ్ పగుళ్లు పట్టించుకోలేదని నిపుణులైన ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఏ రిజర్వాయరు పూర్తి స్థాయిలో నింపలేదు. ఫీల్డ్ చానళ్లు నిర్మించలేదు. ఇది నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.

ప్రశ్నిస్తే ఆరోపణలా?

కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని బుకాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2002 తర్వాత ఆయా రాష్ట్రాలు కట్టుకునే ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతి అవసరం లేదని తెలిపింది.  రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ ప్రాజెక్టు డిజైన్ ఆర్గనైజేషన్ మాత్రమే ఈ ప్రాజెక్టుకు పర్మిషన్ అప్రూవల్  ఇస్తుందని తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా కేంద్రం కొన్ని పర్మిషన్లు మాత్రమే ఇస్తుంది. కానీ అప్రూవల్  ఇవ్వదు. దీనిలో భాగంగానే పర్యావరణ, అటవీ క్లియరెన్సు ఇచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ ప్రకారం హైడ్రాలాజికల్ క్లియరెన్స్ (నీటి లభ్యత), ఎకనామిక్ వయబులిటీ  సంబంధించిన అనుమతులు మాత్రమే ఇచ్చింది.

 డీపీఆర్​లో వరి లేదు. డీపీఆర్​లో 160 టీఎంసీలకు అనుమతిగా తేలింది. 1 టీఎంసీకి 13వేల ఎకరాలు సాగు చూపించింది. కానీ, మేము360 టీఎంసీలు ఎత్తిపోసేందుకు డిజైన్ చేశామని కేసీఆరే చెప్తున్నారు. డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టు లేదు. పంపింగ్, బ్యారేజ్, లొకేషన్స్, కన్​స్ట్రక్షన్ క్వాలిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ అనుమతులూ ఇవ్వలేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అనుమతులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. కాస్ట్ బెనిఫిట్ క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టు విధివిధానాలు గమనించే టెండర్ అయిన 3వ టీఎంసీని ఆపించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఈ ప్రాజెక్టు వయబులిటీపై  అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద జవాబు లేదు. పైగా బుకాయిస్తున్నది.

నిర్మాణం, అవినీతిపై దర్యాప్తు జరగాలె

ఈ ప్రాజెక్టును పూర్తిగా ఇంజినీరింగ్ నిపుణులతో రివ్యూ చేయించాలి. ప్రాజెక్టు వయబులా, కాదా అనేది నిగ్గు తేల్చాలి. రష్యాలో ఇలాంటి లిఫ్ట్ ప్రాజెక్టులు కడితే ఫెయిలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఏపీఎస్ఐఐడీసీ (ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ డెవలప్​మెంట్ కార్పొరేషన్) ఫెయిలయ్యాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువపై ఉన్న లిఫ్టులు మెయింటెనెన్స్ లేక ఫెయిలయ్యాయి. సాగునీరు, వ్యవసాయం కలిపి సమగ్ర (ఇంటిగ్రేటెడ్) ప్రణాళిక లేకపోవడం వల్ల సాగు అంచనాలు ఫెయిలవుతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన బ్యారేజీలు, రిజర్వాయర్లలో లీకేజీలు, బుంగలు రావడం జరుగుతున్నాయి. దీనిపై క్వాలిటీ కంట్రోల్ రిపోర్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. కన్ స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ లో ఆపరేషన్ మెయింటెనెన్స్ కాస్ట్ లెక్కగట్టాలి. కానీ, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.  ఈ ప్రాజెక్టులోని అవినీతిపై పూర్తిస్థాయి సీబీఐ దర్యాప్తు జరగాలి. అందులోని రిపోర్టుల ప్రకారం అటు బాధ్యులైన రాజకీయ, అధికార, కాంట్రాక్టర్ గణాలపై చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఇలాంటి మోసపూరిత ప్రాజెక్టులకు డిజైన్ చేసి, ప్రజలను మోసం చేసే కుయుక్తులకు దీనితో ఫుల్ స్టాప్ పడాలి. నిధుల రికవరీ జరగాలి.  జరగబోయే ఎన్నికల్లో ప్రజలు వీళ్లను శిక్షించాలి.

వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే  జాతీయహోదా అడిగారు!

ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు జాతీయ హోదా అడగలేదు. ప్రాజెక్టు కట్టి, అది వయబులిటీ లేదన్నప్పుడు సమస్యను పక్కదారి పట్టించేందుకు జాతీయ హోదా గురించి మాట్లాడుతున్నారు. జాతీయ హోదా కావాలంటే దాని నీటి లభ్యత, విద్యుత్, తాగునీరు, పునరావాసం, అంత ర్రాష్ట్ర, సమస్యలు, ఆర్థిక వెసులుబాటు పరిశీలించి సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తుంది. అప్పుడు ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు ఇస్తుంది. ఆ తర్వాత జాతీయ హోదాకు హైవపర్ స్టీరింగ్ కమిటీ ప్రతిపాదన చేస్తుంది. అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ పరిశీలించి ఆమోదం ఇస్తుంది. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదం వస్తుంది. అప్పుడే జాతీయ ప్రాజెక్టుగా పూర్తిస్థాయి అనుమతి లభిస్తుంది. ఇవి ఏవీ లేకుండా ప్రాజెక్టు కట్టేసి, జాతీయ హోదా డిమాండ్ చేయడం, కేవలం వైఫల్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నమే. తెలంగాణ ప్రజలను మోసం చేసే కేసీఆర్ గారడి విద్య ఇది.  పూర్తిగా అది ప్రభుత్వ దివాలాకోరుతనమే.

ALSO READ : సరైన నిర్ణయమే.. తెలంగాణలో మార్పే లక్ష్యంగా

పాత ఆయకట్టు తప్ప కొత్త ఆయకట్టు ఎంత?

తెలంగాణ వచ్చే వరకే రైతులు సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న 28 లక్షల పంపుసెట్ల ద్వారా 30 లక్షల ఎకరాలు, కాకతీయులు కట్టించిన 46 వేల చెరువులు, కుంటల ద్వారా 26 లక్షల ఎకరాలు, పాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా 3 లక్షల ఎకరాలు, కృష్ణానది ప్రాజెక్టుల ద్వారా 34 లక్షల ఎకరాలు, తెలంగాణ రాకముందే నిర్వహించిన గోదావరి ప్రాజెక్టుల ద్వారా 30 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. వర్షాకాలం వానల ద్వారా మరో 20 లక్షల ఎకరాలు సాగవుతున్నది. తెలంగాణలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1కోటి 50లక్షల ఎకరాలు సాగవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. పైవన్నీ కలిపితే 1.50 కోట్ల ఎకరాలు సాగు అవుతున్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల సాగు ఎక్కడున్నది?  కేసీఆర్ కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

- నరహరి వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు