ఇంజినీర్లకు కాళేశ్వరం టెన్షన్..

ఇంజినీర్లకు  కాళేశ్వరం టెన్షన్..
  • ప్రాజెక్టు లోపాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయోనని హైరానా
  • కుంగిన మేడిగడ్డ.. అన్నారం బ్యారేజీకి బుంగలు
  • నిరుడు నీట మునిగిన కన్నెపల్లి, అన్నారం పంప్‌‌హౌస్‌‌లు
  • బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ఇంజినీర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు టెన్షన్​పట్టుకుంది. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ఈ ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండటంతో..తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని భయపడుతున్నారు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.. తర్వాత అన్నారం బ్యారేజీకి బుంగలు పడ్డాయి. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిగా ఖాళీ చేశారు. నిరుడు వరద పోటెత్తి కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌‌లు మునిగిపోయి భారీ నష్టం వాటిల్లింది. ప్రాజెక్టులోని ఇతర ప్యాకేజీల్లోనూ ఏదో ఒక లోపం బయట పడుతూనే ఉంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై ఫోకస్​పెట్టారు. కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తప్పవని ఉత్తమ్ నిర్వహించిన మొదటి రివ్యూలోనే హెచ్చరించారు. 

ఇన్నాళ్లు ప్రపంచానికే ఈ ప్రాజెక్టు తలమానికం అంటూ ప్రచారం చేసిన ఇంజనీర్లకు ఈ హెచ్చరికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.  ప్రాజెక్టులో లోపాలకు తామెక్కడ బాధ్యత వహించాల్సి వస్తుందోనని వారు హైరానా పడుతున్నారు.

రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు

ఉమ్మడి ఏపీలో వైఎస్ ​ప్రభుత్వం.. జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు నీటిని ఎత్తిపోయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును డిజైన్​ చేశారు. రూ.38 వేల కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా.. తెలంగాణ ఏర్పడే నాటికే రూ.8 వేల కోట్ల పనులు పూర్తి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక.. ప్రాణహిత – చేవెళ్లను రీ డిజైన్​పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఒక్క స్టేజీలో నీటిని లిఫ్ట్​చేస్తే సరిపోయేది.. దానికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌస్ లు నిర్మించి.. మూడు స్టేజీల్లో నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు.

ఈ మూడు బ్యారేజీలు, పంపుహౌస్​లు, ఇతర పనుల కోసమే అదనంగా రూ.28 వేల కోట్లు ఖర్చు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత – చేవెళ్ల ను రూ.38 వేల కోట్లతో డిజైన్​చేయగా, కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్​చేసిన తర్వాత వ్యయం రూ.1.16 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటికే రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారు.

రికార్డు కోసం పరుగులు

రికార్డు టైమ్‌‌లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పనులను పరుగులు పెట్టించింది. ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు, ఇంజనీర్లు దీనికి వంత పాడారు. దీంతో ప్రాజెక్టును పటిష్టంగా నిర్మించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా వరుసగా ఏదో ఒక లోపం బయట పడుతూనే ఉంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ ఆగస్టు 21న అమాంతం కుంగిపోయింది. ఏకంగా 1.20 మీటర్లు ఒక పిల్లర్​ కుంగిపోవడంతో ఆ ప్రభావం ఏడో బ్లాక్​లోని అన్ని పిల్లర్లపై పడింది. దీంతో ఆ బ్లాక్​ మొత్తాన్ని కొత్తగా నిర్మించాల్సిన పరిస్థితి తలెత్తింది. రూ.4,600 కోట్లతో ఈ బ్యారేజీని నిర్మించారు. ఇంత ఖర్చుతో కట్టిన ప్రాజెక్టు పటిష్టత, డిజైన్ల విషయంలో అధికారులు, ఇంజనీర్లు కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నేషనల్ డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తమ నివేదికలో విమర్శించింది.

ఈ బ్యారేజీ కుంగిన ఘటనపై ఎన్డీఎస్ఏ నివేదిక రావడానికి ముందే అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడ్డాయి. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై సందేహాలు తలెత్తాయి. అన్ని బ్యారేజీల్లో నీళ్లు ఖాళీ చేసి లోపాలపై సమగ్రంగా స్టడీ చేయాలని స్టేట్​డ్యామ్​సేఫ్టీ ఆర్గనైజేషన్‌‌కు ఎన్డీఎస్ఏ సూచించింది. ప్రస్తుతం బ్యారేజీలో లోపాలపై స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను నిర్మించిన ఏజెన్సీలు లోపాలను సరిదిద్దుతామని ప్రకటించాయి.

మా పరిస్థితి ఏమిటో?

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి పంప్‌‌హౌస్‌‌, అన్నారం పంప్‌‌హౌస్ నిరుడు భారీ వరదలతో మునిగిపోయాయి. కన్నెపల్లి పంప్‌‌హౌస్‌‌లో ఆరు మోటార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అన్నారం పంప్‌‌హౌస్​ నీట మునిగినా స్వల్ప నష్టాలతోనే బయటపడింది. కన్నెపల్లిలో మాత్రం వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ రెండు పంపుహౌస్​లను మేఘా ఇంజనీరింగ్​సంస్థ నిర్మించింది. కన్నెపల్లి పంపుహౌస్​లో పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ దెబ్బతిన్న మోటార్లకు బెంగళూరులో రిపేర్లు చేయిస్తున్నారు. వాటినే తిరిగి పంప్​హౌస్‌‌లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు పంప్​హౌస్​లు మునిగిపోవడానికి డిజైన్​ లోపమే కారణమని తేలింది. గోదావరి గరిష్ట ప్రవాహ మట్టం కన్నా తక్కువ ఎత్తులోనే వీటిని నిర్మించడంతో భారీ నష్టం వాటిల్లింది.

కేసీఆర్​ ప్రభుత్వం తొందర పెట్టడంతోనే హడావుడిగా పనులు చేయాల్సి వచ్చిందని, దాని ఫలితమే ఇది అని కొందరు ఇంజనీర్లు చెప్తున్నారు. రిటైర్ అయి ఎక్స్​టెన్షన్​పై పని చేస్తున్న సీనియర్ ఇంజనీర్ల సంగతి ఏమోకానీ.. తమ పరిస్థితి ఏమిటని ఫీల్డ్‌‌లో పని చేస్తున్న ఇంజనీర్లు హైరానా పడుతున్నారు. అప్పటి ప్రభుత్వం తొందరపాటు, డిపార్ట్​మెంట్​లోని హెచ్​వోడీలు, ఇతర అధికారుల తప్పులకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.