సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..కాళేశ్వరం ఆలయం కిటకిట..

సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..కాళేశ్వరం ఆలయం కిటకిట..
  • పుణ్యస్నానం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క, ఎంపీ వంశీ కృష్ణ 
  • సరస్వతి విగ్రహాన్ని దర్శించుకొని, మొక్కులు 
  • పుష్కర ఘాట్ వద్ద భక్తుల స్నానాలు
  • మే 26 చివరిరోజు కావడంతో పెరిగిన రద్దీ 

జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చా రు. పుణ్యస్నానాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నా రు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కరాలకు విచ్చేశారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11.02 గంటలకు హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే స్వాగతం పలికారు. 

పుణ్యస్నానం ఆచరించిన తర్వాత గవర్నర్ దంపతులు శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకు న్నారు. ఆలయం వద్ద వారికి పరివట్టం, పూర్ణకుంభం. మంగళ వాయిద్యాలతో అర్చకులు, దేవాదాయ శాఖ  డైరెక్టర్ వెంకట్ రావు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్​ దంపతులకుపూజారులు ఆశీర్వచనం అందించి, శ్వేత వస్త్రం, ప్రసాదం, అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. సరస్వతి ఏక శిలా విగ్రహాన్ని వారు దర్శించుకున్నారు. కాగా, మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పుష్కరాల్లోపుణ్యస్నానం చేసి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.. 

కాళేశ్వరం లో భక్తజన సందోహం 

సరస్వతి పుష్కరాలకు హాజరవుతున్నభక్తులతో కాళేశ్వరం కిటకిటలాడుతున్నది. భారీగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరా దిన ఉన్న ప్రయాగరాజ్ వద్దమాత్రమే సరస్వతి పుష్కరాలు జరిగేవి. ఆ సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో ప్రారంభించింది. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కాళే శ్వరం చేరుకుంటున్నారు. 

పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు.. 

త్రివేణి సంగమానికి చీరెసారె సమర్పించి.. సైకత లింగాలకు పూజలు చేస్తున్నారు. పూర్వీకులను స్మరించుకుంటూ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. సోమవారంతో సరస్వతి పుష్కరాలు ముగియనున్నందున భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతున్నది. దీంతో ఆదివారం కూడా కాళేశ్వరంలో ట్రాఫిక్ జామ్ యధావిధిగా కొనసాగింది. మూడు వైపులా వెహికల్స్  ఎక్కడికక్కడే ఆగిపోయాయి.