
- 4 నుంచి 11వరకు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్లకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను రాష్ట్రంలోని ప్రైవేట్ నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల మేనేజ్‌మెంట్ కోటా(ఎంక్యూ1, ఎంక్యూ-2/ఎన్ఆర్ఐ, ఎంక్యూ-3) సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్-పీజీ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్ లోడింగ్ ప్రక్రియ అక్టోబర్ 4న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై, అక్టోబర్11న సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
ప్రవేశాలకు కనీస కటాఫ్ స్కోర్‌ను జనరల్ కేటగిరీకి 276 (50వ పర్సంటైల్), ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు 255 (40వ పర్సంటైల్), ఓసీ పీడబ్ల్యూడీలకు 235 (45వ పర్సంటైల్)గా నిర్ణయించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఫీజుగా రూ.15వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా స్టేట్ లెవెల్ మెరిట్ లిస్టును విడుదల చేసి, ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు https://pvttspgmed.tsche.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ http://knruhs.telangana.gov.in/ ను సందర్శించాలని అధికారులు సూచించారు. టెక్నికల్ హెల్ప్ కోసం 9392685856, 7842136688, 9059672216, రూల్స్ వివరాల కోసం 7901098840, 9490585796 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.