
బింబిసార అనే టైటిల్‌తోనే తన సినిమాపై ఆసక్తిని కలిగించిన కళ్యాణ్ రామ్.. ఆ రాజు గెటప్‌లో తన లుక్‌ని రిలీజ్ చేసి ఇంప్రెస్ చేసేశాడు. అతని కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. వశిష్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామే నిర్మిస్తున్నాడు. ‘బింబిసారుడి పట్టాభిషేకానికి ముహూర్తం కుదిరింది’ అంటూ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేయనున్నట్టు నిన్న ప్రకటించాడు కళ్యాణ్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో చాలా స్టైలిష్‌గా ఉన్నాడతను. పెద్ద పెద్ద బిల్డింగుల మధ్య నిలబడి సీరియస్‌గా చూస్తున్నాడు. సూటూ బూటూ వేశాడు. కళ్లకి గాగుల్స్, చెవికి రింగ్ పెట్టాడు. గడ్డం పెంచాడు. మీసం మెలి తిప్పాడు. మొత్తంగా ఓ కొత్త అవతార్‌లో కనిపించాడు. అతనికి జోడీగా క్యాథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్ కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్‌కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.