వెయ్యింతల.. వెయ్యి స్తంభాల శోభ.. 18 ఏండ్ల తర్వాత అందుబాటులోకి వేయి స్తంభాల కల్యాణ మండపం

వెయ్యింతల.. వెయ్యి స్తంభాల శోభ.. 18 ఏండ్ల తర్వాత అందుబాటులోకి వేయి స్తంభాల కల్యాణ మండపం
  • మహా శివరాత్రివేళ నేడు పున:ప్రారంభం

  •  హాజరవుతున్న కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి

వరంగల్‍, వెలుగు: హనుమకొండ  వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణ మండపం  పునప్రారంభం కానుంది.   ఓరుగల్లు కాకతీయుల ఘనకీర్తికి నిలువుటద్దంగా నిలిచిన వెయ్యికాళ్ల మండపాన్ని 18 ఏండ్ల తర్వాత   మహా శివరాత్రివేళ కేంద్ర టూరిజం మంత్రి కిషన్‍రెడ్డి   రుద్రేశ్వరునికి పూజలు నిర్వహించి   ప్రారంభించనున్నారు.
 
  18 ఏండ్లు పట్టింది

వానలు, వరదలకు కొన్ని పిల్లర్లు కుంగిన క్రమంలో 2005లో కల్యాణ మండపానికి   రిపేర్లు చేసి విరిగిన శిల్పాలను మారుస్తామన్నారు. 18 నెలల్లో వాటిని సరిదిద్ది.. తిరిగి నిలబెడతామని చెప్పి 2006లో కల్యాణ మండపాన్ని విప్పికుప్పబెట్టారు. సెంట్రల్‍ ఆర్కియాలజీ  డిపార్టుమెంట్‍ అప్పుడే అవసరమైన రూ.7.5 కోట్లు కేటాయించింది. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్‍ ఆధ్వర్యంలో 70 మంది శిల్పాకారులు పనులు మొదలుపెట్టారు.  

ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో అనుకున్న బడ్జెట్ కంటే మరో రూ. 6 కోట్ల ఖర్చు పెరిగింది. వాటిని సెంట్రల్‍ ఆర్కియాలజీ  డిపార్ట్​మెంట్​ ఇవ్వడానికి  ఓకే చెప్పింది. కాగా, చేసిన పనులకు సంబంధించి ఖర్చులు, బిల్లులు ఇవ్వకుండా అప్పట్లో అధికారులు పనులను పక్కదారి పట్టించారు.   రాష్ట్రం వచ్చాక తామే ఈ పనులను చేపిస్తామని కేసీఆర్‍ మొదలు,  మొన్నటివరకు లోకల్‍ ఎమ్మెల్యేగా ఉన్న  దాస్యం వినయ్‍భాస్కర్‍ చెప్పుకొచ్చారు.  చివరికి 18 ఏండ్ల అనంతరం కల్యాణ మండపం పనులు ఇప్పుడు పూర్తయ్యాయి.

 సాండ్‍ బాక్స్​ టెక్నాలజీ..ఫాలో అయిన్రు 

ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని పున:నిర్మాణంలో శిల్పులు.. నాటి కాకతీయుల సాండ్‍ బాక్స్‍ టెక్నాలజీనే వాడారు. ఎక్కడా కూడా సిమెంట్‍, కాంక్రీట్‍, ఐరన్‍ వాడలేదు. ఇసుక ఆధారంగానే మళ్లీ నిలబెట్టారు. మండపం తొలగించిన అడుగు భాగంలో 3 మీటర్ల లోతు పునాది తవ్వారు. దానిలో రేగడి మట్టి  నింపారు. గ్రానైట్‍, ఇటుక, కరక్కాయ, బెల్లంతో చేసిన మిశ్రమంతో   క్యూరింగ్‍ చేశారు. ఆపై ఇసుక బేస్‍మెంట్‍పై రాళ్లు, స్తంభాలు నిలబెట్టారు. భూకంపాలు, తుఫాన్‍ వంటి విపత్తులు వచ్చినాపడకుండా రాళ్ల మధ్య స్టెయిన్‍లెస్‍ స్టీల్‍ పట్టీలతో బిగించారు.  

కిషన్‍రెడ్డి చేతుల మీదుగా పున:ప్రారంభం

 ములుగు జిల్లా రామప్ప టెంపుల్‍ యునెస్కో గుర్తింపు పొందిన నేపథ్యంలో.. మంత్రి కిషన్‍రెడ్డి వచ్చారు.  2022 ఏప్రిల్‍ 26న కేంద్ర ప్రభుత్వ టూరిజం, ఇతర శాఖల అధికారులతో ఆలయాన్ని దర్శించుకున్నారు. కల్యాణ మండపం తిరిగి నిర్మించే బాధ్యత తనదేనని మాటిచ్చారు.  అప్పటికప్పుడు మరో రూ.15 కోట్లు మంజూరు చేశారు.   18 ఏండ్ల నిరీక్షణ తర్వాత వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండప శిల్పసంపదను చూసే అవకాశం దక్కింది.  కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నేడు దీనిని పున:ప్రారంభించనున్నారు. 

డంగు సున్నం.. కరక్కాయ పొడితో నిర్మాణం

ఓరుగల్లు కాకతీయుల పాలనలో ఒకటో రుద్రుడు 1163లో వెయ్యిస్తంభాలగుడిని నిర్మించాడు. 1400 మీటర్ల  వైశాల్యంలో.. శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే ఆలయం ఇది.  అందుకే దీనిని త్రికూటాలయంగా చెబుతారు. ఇక్కడి ప్రతి రాయి లయబద్ధమైన సంగీతం అందించేది. శిలలపై సప్తస్వరాలు పలికించిన ఘనత నాటి కళాకారులకు దక్కింది.  

ఇప్పటిలా సైన్స్ అండ్‍ టెక్నాలజీ, టన్నులకొద్ది బరువులెత్తే క్రేన్లు  అందుబాటులో లేకున్నా దీనిని 1000 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా నిర్మాణాలు చేశారు. .. తుగ్లక్‍ సేనలు వీటిని పడగొట్టేలా దండయాత్రలు చేసినా పడిపోకుండా.. డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి వంటి మిశ్రమాలను వాడారు  అప్పట్లో వర్షాల  కారణంగా కల్యాణ మండపంలోని కొన్ని పిల్లర్లు కుంగాయి తప్పితే.. శిల్ప సంపద దెబ్బతినలేదు.