
బెంగుళూర్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు. కర్నాటకలో తన తాజా చిత్రం థగ్ లైఫ్ విడుదలను అడ్డుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సినిమా ప్రదర్శనకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాడు.
అసలేం జరిగిందంటే..?
కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా 2025, జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా 2025, మే 24న చెన్నైలో థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళం నుంచే కన్నడ భాష ఉద్భవించిందని అన్నారు. హీరో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కమల్ హాసన్ వ్యాఖ్యల పట్ల కన్నడిగులు, పలు సంఘాలు భగ్గుమన్నాయి. కమల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కూడా రియాక్ట్ అయ్యింది. కన్నడ భాషను అమానించేలా చేసిన వ్యాఖ్యల పట్ల కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని.. లేదంటే ఆయన నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ కర్నాటకలో విడుదల కాకుండా నిషేధం విధిస్తామని అల్టిమేటం జారీ చేసింది. కానీ కమల్ హాసన్ మాత్రం క్షమాపణ చెప్పాలేదు. ‘నేను తప్పు చేస్తే క్షమాపణ చెబుతా.. కానీ నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పను. ఇది నా జీవన విధానం’ అని ఆయన తెగేసి చెప్పారు.
కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పకపోవడంతో జూన్ 5న విడుదల కావాల్సి ఉన్న అతడి చిత్రం థగ్ లైఫ్ విడుదలపై కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ కర్నాటక హైకోర్టు మెట్లు ఎక్కారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ALSO READ : Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. నిర్మాత ఏం చెప్పారంటే..?
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలు తన థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకోవద్దని ఆదేశించాలని కోర్టును కోరారు. సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రతా కల్పించేలా పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించాడు. సినిమా విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో కమల్ పిటిషన్పై కర్నాటక హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి మరీ.