న్యూఢిల్లీ : సినిమాలు, బిగ్‌బాస్ షో లాంటివి చేస్తూ పార్టీకి ఫండ్ జమ చేస్తున్నానని తెలిపారు మక్కల్ నీధి మయ్యమ్ అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్. తానెవరికీ ‘బీ టీమ్’ కాదన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.... తాను బీజేపీకి బీ టీమ్ అని, మోదీ,షా సలహాలు తీసుకుంటున్నారని డీఎంకే నేతలు ఆరోపించడంపై ఆయన స్పందించారు. అవన్నీ వారి ఊహాగానాలే అని కొట్టిపారేశారు. తమ వల్ల డీఎంకే నిద్రలేని రాత్రులు గడుపుతోంది. అందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. అని కమల్ అన్నారు. తమ ప్రత్యర్థి డీఎంకేనని, అధికార అన్నాడీఎంకే తనని తాను కూలదోసుకుంటోందని కమల్ విమర్శించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదన్న నిర్ణయం తీసుకోవడం అది ఆయన వ్యక్తిగత వ్యవహారమని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయినా, బాధపడనని, నిత్యం ప్రజల మధ్యే ఉంటానని చెప్పుకొచ్చారు కమల్.
