డ్రాఫ్ట్ దశలోనే మాస్టర్ ప్లాన్ : కామారెడ్డి కలెక్టర్

డ్రాఫ్ట్ దశలోనే మాస్టర్ ప్లాన్ : కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని ప్రస్తుతం అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ పై ఏదైనా సమస్యలుంటే ఈ నెల 11వరకు రైతులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలపవచ్చునని  జితేష్ పాటిల్ వెల్లడించారు. 60 రోజుల్లో స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వొచ్చని దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశామ‌ని అన్నారు. మాస్టర్ ప్లాన్ పై ఇప్పటి వ‌ర‌కు 1026 అభ్యంత‌రాలు వచ్చాయని చెప్పారు. రైతు రాములు ఆత్మహత్యను ఈ ఘటనతో లింక్ చేయడం కరెక్ట్ కాదని కామారెడ్డి కలెక్టర్ సూచించారు. ఆయన తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. 

మాస్టర్ ప్లాన్ లో ఎవరూ భూములు కోల్పోరని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో ఏ రైతు భూములు కోల్పోనప్పుడు మరి ఇప్పుడెలా కోల్పోతారని కలెక్టర్ ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరగకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ మొదటి దశలోనే ఉన్నదని, ఫైన‌ల్ కావాడానికి చాలా ద‌శ‌లు ఉన్నాయన్నారు. రైతుల భూములు ఎక్కడికి పోవన్న ఆయన... ఎవరి భూమి వారి పేరు మీద‌నే ఉంటుంద‌న్నారు. తమ దృష్టికి వ‌స్తున్న అభ్యర్థన‌ల‌ను ప‌రిశీలించి, నివృత్తి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ విషయంలో రైతులకు ఎలాంటి అనుమానాలూ  వద్దన్నారు. రైతులు అనవసరంగా ఆందోళనలు చేయవద్దని చెప్తూనే.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం  చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.