
- బెడ్లు సాల్లలే!
- కిటకిటలాడుతున్న కామారెడ్డి జిల్లా హాస్పిటల్
- జ్వరపీడితులతో నిండిన కామారెడ్డి జిల్లా ఆసుపత్రులు
- సరిపడా బెడ్లు లేక రోగుల పాట్లు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి నాలుగు రోజుల కింద తీవ్ర జ్వరం వచ్చింది. ఫ్యామిలీ మెంబర్లు అతడిని జిల్లా హాస్పిటల్‌కు తీసుకొచ్చిన్రు. ఇక్కడ బెడ్స్ ఖాళీ లేవని చెప్పడంతో చేసేది లేక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా హాస్పిటల్‌కు వస్తున్న వారందరికీ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. వాతవరణంలో మార్పులతో చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు వస్తున్న వారిలో కొందరికి డెంగీ, మలేరియా నిర్ధారణ అవుతున్నాయి. జ్వరం, విరేచనాలతో బాధపడుతున్న వారికి హాస్పిటల్‌లోనే చేర్చుకొని ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి వస్తోంది.
బెడ్స్ లేక ఇబ్బందులు..
కామారెడ్డి జిల్లా హాస్పిటళ్లలో సరిపడా బెడ్స్ లేకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దవాఖానాకు జిల్లా వాసులే కాకుండా దగ్గరలో రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. 100 పడకల హాస్సిటల్‌లో కొద్ది రోజుల కింద స్థానికంగా సర్దుబాటు చేసి 80 బెడ్స్ అదనంగా ఏర్పాటు చేశారు. యాక్సిడెంట్ కేసులు, వివిధ రకాల రోగాల పేషెంట్లు ఇక్కడికి రావడంతో పాటు ప్రతి రోజు 15 వరకు డెలీవరీలు ఉంటాయి. కొన్ని సార్లు 20 వరకు కూడా చేస్తారు. నార్మల్ డెలీవరీతో పాటు, సీజేరియన్ అయిన వాళ్లు 3 నుంచి 5 రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉంటారు.
హాస్పిటల్‌లోని 180 బెడ్స్‌లో గైనిక్ వార్డులోనే 60 నుంచి 80 బెడ్స్ ఉన్నాయి. చిన్న పిల్లల వార్డులో 12 బెడ్స్ ఉన్నాయి. డయాలసిస్ పేషెంట్ల వార్డు, ఐసీయూ వార్డుతో పాటు, జనరల్ వార్డు, వివిధ రకాల రోగాలతో ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లు, తీవ్ర జ్వరం, ప్లేట్లెట్లు తగ్గి డెంగీ వచ్చిన వాళ్లు, విరేచనాలు అవుతున్న వాళ్లు ఎక్కువ మంది ఇన్పెషేంట్లుగా ఉన్నారు. వీరందరికీ బెడ్స్ సరిపోవడం లేదు. ఈ క్రమంలో మరిన్ని బెడ్స్ అందుబాటులోకి తేవాలని పబ్లిక్ కోరుతున్నారు.ప్లేట్లేట్లు తగ్గాయ్నాలుగు రోజులుగా బాగా జ్వరం వచ్చింది. ఇక్కడికి వస్తే టెస్టులు చేసి ప్లేట్లెట్లు తగ్గాయని చెప్పారు. రెండు రోజుల కింద జిల్లా హాస్పిటల్‌లో చేరాను. ఇంకా ట్రీట్‌మెంట్ నడుస్తోంది.
- సాయిబాబా, కామారెడ్డి
అడ్జస్ట్ చేస్తున్నాం
హాస్పిటల్‌లో బెడ్స్ ప్రాబ్లమ్ ఉన్నది వాస్తవమే. పరస్థితి సీరియస్‌గా ఉన్న వారికి బెడ్స్ అడ్జస్ట్ చేస్తున్నాం. జ్వరాలతో బాధపడుతున్న వాళ్లు ఇటీవల ఎక్కువగా వస్తున్నారు. రోగులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం.
- డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంవో