గణేషుడి కోసం వచ్చారు.. వరదలో చిక్కుకున్నారు..మెదక్‌‌ – బోధన్‌‌ రోడ్డు కొట్టుకుపోయింది..

గణేషుడి కోసం  వచ్చారు.. వరదలో చిక్కుకున్నారు..మెదక్‌‌ – బోధన్‌‌ రోడ్డు కొట్టుకుపోయింది..
  • గణేశ్‌‌ విగ్రహం కోసం వచ్చి.. వాగు ఒడ్డున ఉండిపోయారు
  • మెదక్‌‌ జిల్లా పోచంరాల్ శివారులో చిక్కుకున్న 15 మంది కామారెడ్డి జిల్లావాసులు
  •  మెదక్‌‌ – బోధన్‌‌ రోడ్డు కొట్టుకుపోవడంతో నిలిచిన రాకపోకలు
  • తాళ్లు, బోట్ల సహాయంతో ఒడ్డుకు చేర్చేందుకు ఆర్మీ యత్నం
  • వరద ఉధృతితో ఇబ్బందులు.. పునరావాస కేంద్రాలకు తరలింపు

మెదక్, వెలుగు : వినాయక విగ్రహం కొనేందుకు మెదక్‌‌ జిల్లాకు వచ్చిన 15 మంది కామారెడ్డి జిల్లావాసులు పోచారం వరద కారణంగా మూడు రోజులుగా ఇక్కడే చిక్కుకుపోయారు. వారిని స్వగ్రామానికి చేర్చేందుకు ఆర్మీ జవాన్లు నాలుగు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌‌ చేపట్టినా.. వరద ఉధృతి కారణంగా సాధ్యం కాలేదు. దీంతో వారిని మెదక్‌‌లోని పునరావాస కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే...

 కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన 9 మంది పిల్లలు, ఆరుగురు వ్యక్తులు కలిసి వినాయక విగ్రహం, సామగ్రి కొనేందుకు బుధవారం మెదక్‌‌ పట్టణానికి వచ్చారు. విగ్రహాన్ని కొని తిరిగి వెళ్తుండగా.. నాగాపూర్‌‌ వద్ద నక్కవాగు వరద హైవేను ముంచెత్తడంతో గ్రామానికి వెళ్లలేకపోయారు. దీంతో ఆ రోజు అక్కడే ఉండి.. వరద తగ్గిన తర్వాత తిరిగి బయలుదేరారు. అయితే పోచారం ప్రాజెక్ట్‌‌ పొంగిపొర్లడంతో వచ్చిన వరద కారణంగా పోచంరాల్‌‌ గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద మెదక్‌‌ – బోధన్‌‌ హైవే 50 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించిపోవడంతో వారు మూడు రోజులుగా పోచంరాల్‌‌ గ్రామంలోనే ఉండిపోయారు.

 విషయం తెలుసుతున్న ఆర్మీ జవాన్లు 50 మంది శుక్రవారం ఘటనాస్థలానికి చేరుకొని 15 మందిని తిరిగి లింగంపల్లి తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌‌ చేపట్టారు. తాళ్లు, బోట్ల సాయంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనేక రకాలుగా ప్రయత్నించారు. కానీ పోచారం ప్రాజెక్ట్‌‌ నుంచి వరద ఉధృతంగా వస్తుండడంతో రెస్క్యూ ఆపరేషన్‌‌కు అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. 

విషయం తెలుసుకున్న కలెక్టర్‌‌ రాహుల్‌‌రాజ్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి, ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌‌ను నిలిపివేయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 15 మందిని మెదక్‌‌ పట్టణంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు.