ఇండ్లు కూలిన బాధితులకు.. ఇందిరమ్మ భరోసా

ఇండ్లు కూలిన బాధితులకు.. ఇందిరమ్మ భరోసా
  • జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్​లో భారీ వర్షాలు
  • 700లకు పైగా దెబ్బతిన్న ఇండ్లు
  • ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా 603 మంది గుర్తింపు
  • ఇప్పటికే 180 మందికి ఇండ్లు మంజూరు, పనులు ప్రారంభం
  • బాధితులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్​ సర్కార్

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్​లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వానలకు పెంకుటిండ్లు, గుడిసెలు పూర్తిగా కూలిపోగా, పురాతన రేకులు, దాబా ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిరాశ్రయులైన బాధితులకు కాంగ్రెస్​ సర్కార్​ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి భరోసా కల్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా 7 వందలకుపైగా ఇండ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. ఇందులో 603 మంది బాధితులు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా జిల్లాయంత్రాంగం గుర్తించింది. 312 మంది ఇండ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపగా, 180 మందికి ఇండ్ల మంజూరు పత్రాలు అందజేసి పనులు ప్రారంభించారు. 

మిగతా వారికి విడతల వారీగా ఇండ్లు కేటాయించనున్నట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు 11,623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 6400 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమై పనులు కొనసాగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులలో నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లోన్లు ఇప్పిస్తూ పనులు చేపట్టేలా అధికారులు పోత్సహిస్తున్నారు. 

కలెక్టర్​ స్పెషల్​ ఫోకస్​..

వర్షాల వల్ల ఇండ్లు కూలిన బాధితులను గుర్తించేందుకు కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ స్పెషల్​ఫోకస్​ పెట్టారు. కూలిన ఇండ్ల వివరాలు సేకరించాలని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్​ ఆదేశాలతో జిల్లాయంత్రాంగం ముమ్మరంగా సర్వే చేసి కూలిన ఇండ్ల నివేదికను సిద్ధం చేసింది. కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, డోంగ్లి, జుక్కల్​, నిజాంసాగర్​, పిట్లం, మహ్మద్​నగర్​ మండలాల్లో ఇండ్లు అధికంగా దెబ్బతిన్నట్లు గుర్తించి కలెక్టర్​కు నివేదిక పంపించారు. దీంతో ఇదివరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మించుకోవడం ఇష్టంలేని వారి పేర్లను తొలగించి, వారి స్థానంలో వర్షం వల్ల ఇండ్లు కూలిన బాధితులకు కేటాయించాలని కలెక్టర్​ఆదేశించారు. 

అధికారులు అర్హులను గుర్తించి ఇండ్లు మంజూరు చేయగా, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇండ్ల నిర్మాణాలు ఏదశలో ఉన్నాయి... బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతున్నాయా.. ఇసుక విషయంలో సమస్యలు ఉన్నాయా.. పనులు ప్రారంభించని లబ్ధిదారులకు లోన్లు ఇప్పించారా.. అన్న అంశాలపై కలెక్టర్​ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.